గడ్కారీ ఘనకార్యం : ఓవర్ స్పీడ్ గా వెళ్లి ఫైన్ కట్టాను

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు తాను కూడా ఫైన్ కట్టాల్సివచ్చిందని కేంద్ర రోడ్డు, రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఇటీవల మోటారు వాహనాల చట్టంలో మార్పులు తీసుకువచ్చి, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వాహనదారులకు భారీ జరిమానాలు వడ్డిస్తున్న విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు భారీ జరిమానాలు విధించామని మంత్రి ప్రకటించారు.
ఓ ఇంటర్వ్యూలో గడ్కరీ మాట్లాడుతూ…నేను ఢిల్లీలో ఉన్న సమయంలో నా కారు డ్రైవరు ముంబైలోని వర్లీ-బాండ్రా సీ లింక్ మార్గంలో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి వేగంగా నడిపారు. నా కారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వేగంగా పోవడం రోడ్డుపై ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఓవర్ స్పీడ్ గా కారు నడిపినందుకు జరిమానా విధించారు. వెంటనే నేను జరిమానా మొత్తాన్ని చెల్లించాను అని నితిన్ గడ్కరీ చెప్పారు. అయితే ఎంత చెల్లించింది ఆయన చెప్పలేదు.
2004లో తాను రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి పాలయ్యానని మంత్రి చెప్పారు. ఎందరో రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నందున వీటిని అరికట్టేందుకే అధిక జరిమానాలు విధించేలా చట్టంలో మార్పులు తీసుకువచ్చామని మంత్రి తెలిపారు. తాము ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు ఈ భారీ జరిమానాలు విధించడం లేదని, కేవలం రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు అధిక జరిమానాలు వేస్తున్నామని నితిన్ గడ్కరీ తెలిపారు.అనేక రాష్ట్రాలు నూతన రవాణ చట్టాన్ని ఆమోదించాయని, రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు భారీ జరిమానాల చట్టం ఉపయోగపడుతుందని నితిన్ గడ్కరీ తెలిపారు.