రిజర్వేషన్ల రగడ : గుజ్జర్ల ఆందోళన హింసాత్మకం

  • Published By: chvmurthy ,Published On : February 10, 2019 / 03:08 PM IST
రిజర్వేషన్ల రగడ : గుజ్జర్ల ఆందోళన హింసాత్మకం

జైపూర్ :  రాజస్ధాన్ రాష్ట్రంలో  రిజర్వేషన్ల కోసం గుజ్జర్లు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆదివారం   దోలాపూర్ జిల్లాలో రోడ్లపైకి వచ్చిన ఆందోళన  కారులు  రెచ్చి పోయి ఆగ్రా-మొరేనా హైవేను దిగ్భందించారు.  దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు యత్నించగా, ఆందోళన  కారులకు పోలీసులకు మధ్య జరిగిన  ఘర్షణలో ఆందోళన కారులు పలు వాహనాలకు నిప్పింటించారు.  వీటిలో 3 పోలీసు వాహనాలు కూడా ఉన్నాయి. 

మరోవైపు   సవోయి , మధోపూర్  జిల్లాల్లో  గత 3 రోజులుగా  గుజ్జర్లు రైలు పట్టాలపై  టెంటులు వేసుకుని  ధర్నా నిర్వహిస్తున్నారు. దీంతో ముందుజాగ్రత్త చర్యగా  వెస్ట్ సెంట్రల్ రైల్వే ఈ లైను పై నడిచే పలు రైళ్లను రద్దు చేసింది. కొన్నిరైళ్ళను దారి మళ్లించింది.  

విద్యా, ఉద్యోగాల్లో   ప్రత్యేక కేటగిరి కింద తమకు వెంటనే 5 శాతం రిజర్వేషన్  కల్పించాలని గత శుక్రవారం నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేశారు.  దీంతో శనివారం సీఎం అశోక్  గెహ్లాట్  నేతృత్వంలోని ముగ్గురు మంత్రుల కమిటీతో గుజ్జర్ల నేతలు చర్చలు జరిపారు.  ఆ చర్చల్లో సమస్య  పరిష్కారం కాకపోవటంతో ఆదివారం నుంచి మళ్లీ  గుజ్జర్లు ఆందోళనకు  దిగారు. 

ఆర్ధికంగా వెనుకబడిన వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడు తమకు ఎందుకు ఇవ్వరని గుజ్జర్లు  ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2017 లో ప్రత్యేక కేటగిరి కింద గుజ్జర్లకు అయిదు శాతం రిజర్వేషన్ కల్పించింది. ఆ తరువాత ఇతర వెనుకబడిన కులాలకు 21 నుంచి 26 శాతం వరకు కల్పించారు. దీంతో సుప్రీం కోర్టు నిర్దేశించిన యాభై శాతం రిజర్వేషన్లు పూర్తయ్యాయి.