మహారాష్ట్ర హోంమంత్రిపై అవినీతి ఆరోపణలు..రిటైర్డ్ జడ్జితో విచారణ

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ పై మాజీ ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్ ప‌ర‌మ్‌బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై జ్యుడీషియల్ విచారణ చేయించాలని ఉద్ధవ్ సర్కార్ నిర్ణయించింది.

మహారాష్ట్ర హోంమంత్రిపై అవినీతి ఆరోపణలు..రిటైర్డ్ జడ్జితో విచారణ

Maharashtra

Updated On : March 28, 2021 / 4:25 PM IST

Maharashtra మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ పై మాజీ ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్ ప‌ర‌మ్‌బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై జ్యుడీషియల్ విచారణ చేయించాలని ఉద్ధవ్ సర్కార్ నిర్ణయించింది. ఈ విషయాన్ని స్వయంగా హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఆదివారం వెల్లడించారు. త‌న‌పై పరమ్ బీర్ సింగ్ చేసిన ఆరోణలపై హైకోర్టు రిటైర్డ్ జడ్జి విచార‌ణ జ‌రుపుతార‌ని అనిల్ దేశ్‌ముఖ్‌ తెలిపారు. ఈ విచారణతో నిజానిజాలు బయటికి వస్తాయని దేశ్‌ముఖ్ వ్యాఖ్యానించారు.

కాగా, కొద్ది రోజుల క్రితం ముంబై మాజీ పోలీస్ క‌మిష‌న‌ర్‌ ప‌ర‌మ్ బీర్ సింగ్ సీఎం ఉద్దవ్ ఠాక్రే రాసిన లేఖ‌ అధికార కూట‌మిలో ప్ర‌కంప‌న‌లు సృష్టించిన విష‌యం తెలిసిందే. ముఖేష్ అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాల వ్యవహారంలో అరెస్టైన సచిన్ వాజేతో పాటు ఏసీపీ సంజయ్ పాటిల్‌కు పబ్బులు,రెస్టారెంట్లు నుంచి నెలకు 100 కోట్లు వసూలు చేసి, తీసుకొచ్చి ఇవ్వాలని హోంమంత్రి ఆదేశించారని సీఎంకి రాసిన లేఖలో పరమ్ బీర్ సింగ్ ఆరోపించారు.

అయితే ఈ ఆరోప‌ణ‌లను హోంమంత్రితోపాటు కూట‌మిలో భాగ‌మైన ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ కూడా ఖండించారు. పరమ్ బీర్ సింగ్ లేఖలో..హోంమంత్రి ఆదేశించారని చెప్పిన స‌మ‌యంలో అనిల్ దేశ్‌ముఖ్ కరోనాతో స్వీయ నిర్భందంలో ఉన్నట్లు వాళ్లు వాదించారు. అయినా కూడా ఈ ఆరోప‌ణ‌ల‌పై మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి రిటైర్డ్ జ‌డ్జి ద్వారా విచార‌ణ జ‌రిపిస్తార‌ని అనిల్ దేశ్‌ముఖ్ ఆదివారం స్ప‌ష్టం చేశారు.