IPCC: ముందుకొచ్చిన సముద్రం.. వైజాగ్, ముంబై మునిగిపోతాయా? ఐపీసీసీ రిపోర్ట్!

భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో సముద్రం ముందుకు రావడం ఆందోళన కలిగిస్తోంది. వాతావరణ మార్పులపై ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ (IPCC) కొత్త నివేదిక భయంకరమైన హెచ్చరికలను చేస్తుంది.

IPCC: ముందుకొచ్చిన సముద్రం.. వైజాగ్, ముంబై మునిగిపోతాయా? ఐపీసీసీ రిపోర్ట్!

Vizag

Updated On : August 11, 2021 / 7:15 AM IST

Climate Change Report: భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో సముద్రం ముందుకు వస్తుందంటూ వచ్చిన రిపోర్ట్ ఆందోళన కలిగిస్తోంది. వాతావరణ మార్పులపై ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ (IPCC) కొత్త నివేదిక భయంకరమైన హెచ్చరికలను చేస్తుంది. ఈ శతాబ్దం చివరినాటికి సముద్ర మట్టం పెరగడం వల్ల దేశంలోని 12 తీరప్రాంత నగరాలు మునిగిపోయే ప్రమాదం ఉందని, ముడు నగరాలు నీటి అడుగుకి వెళ్లవచ్చునని వాతావరణ మార్పు నివేదిక హెచ్చరించింది. దేశంలో జరుగుతున్న వాతావరణ మార్పుల ప్రభావంతో విశాఖపట్నం సహా 12నగరాలు మూడు అడుగుల మేర మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది IPCC.

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్ధ నాసాకు చెందిన అంతర్ ప్రభుత్వాల ప్యానెల్ నుంచి వచ్చిన విశ్లేషణ ప్రకారం.. సముద్ర మట్టాలలో మార్పులను అంచనా వేయడానికి IPCC నివేదిక ఉపయోగపడుతుంది. అంతరిక్ష ఏజెన్సీ రిపోర్ట్ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంతో పాటు ముంబై, చెన్నై, కొచ్చి, కాండ్లా, ఓఖా, భావ్ నగర్, మంగళూర్, మార్మగోవా, పారాదీప్, ఖిధిర్ పూర్, ట్యుటికోరిన్ 12 భారతీయ నగరాలు మునిగిపోయే ప్రమాదం ఉన్నట్లు గుర్తించింది, వాతావరణ మార్పు పరిస్థితులను అదుపు చేయకపోతే, సముద్ర మట్టాలు పెరగి తీవ్ర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉందని వెల్లడించింది రిపోర్ట్.

IPCC 1988 నుంచి ప్రతి ఐదు లేదా ఏడు సంవత్సరాలకు భూ వాతావరణంపై ప్రపంచ స్థాయి అంచనాలను అందిస్తోంది. ఉష్ణోగ్రత మరియు మంచు కవర్, గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు మరియు గ్రహం అంతటా సముద్ర మట్టాలలో మార్పులపై దృష్టి పెట్టి రిపోర్ట్ ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 71 శాతంగా ఉన్న జల వనరులు, 29 శాతం భూమి ఉండగా.. ఇప్పుడు సముద్రాల మట్టం మరింత పెరగడం కలవరపెడుతోంది. వాతావరణ మార్పులతో భూ-వాతావరణం వేడెక్కి హిమనీ నదులు కరిగిపోవడం కారణమవుతోంది.

2006 నుంచి 2018 మధ్య సాగిన ఓ అధ్యయనం ప్రకారం అంతర్జాతీయంగా సముద్ర మట్టాలు ఏడాదికి 3.7 మిల్లీ మీటర్ల చొప్పున పెరుగుతున్నాయి. ఆసియాలో పెరుగుదల ఎక్కువగా ఉందని, దీని వల్ల భారత్ వంటి దేశాల్లో తీరప్రాంత నగరాలకు ముంపు పొంచి ఉందని చెబుతున్నారు. తీర ప్రాంతాలకు ఆనుకుని అభివృద్ధి చెందుతున్న నగరాలు భవిష్యత్తులో పెరిగే నీటి మట్టాలతో తీవ్ర మార్పులకు కారణం అవుతుందని చెబుతున్నారు నిపుణులు. ఏపీలో విశాఖకు కూడా ఈ ప్రమాదం పొంచి ఉంది.