Rs 2,000 notes : రూ.2వేల నోటుపై షాకింగ్ విషయం చెప్పిన కేంద్రం

Rs 2,000 notes not printed in last 2 years : దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రూ.2వేల నోటుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. రూ.2వేల నోటు ఎందుకు ఎక్కువగా కనిపించడం లేదు? వాటి ముద్రణ ఎందుకు తగ్గించారు? ఎన్ని నోట్లు చెలామణిలో ఉన్నాయి? ఇలాంటి ప్రశ్నలకు కేంద్రం సమాధానం ఇచ్చింది.
గత రెండేళ్లుగా రూ.2వేల నోటును ముద్రించడం లేదని సోమవారం(మార్చి 15,2021) లోక్‌సభలో వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. 2018, మార్చి 30నాటికి మొత్తం 336.2 కోట్ల రూ.2000 నోట్లు చెలామణిలో ఉన్నాయని ఆయన చెప్పారు. ఇక 2021, ఫిబ్రవరి 26 నాటికి వీటి సంఖ్య 249.9 కోట్లకు తగ్గిందన్నారు. ప్రజల ఆర్థిక లావాదేవీల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐతో సంప్రదించి నోట్ల ముద్రణపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అనురాగ్ ఠాకూర్ వివరించారు.
2019-20, 2020-21లలో రూ.2000 నోటు ముద్రించ లేదన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 354.2 కోట్ల రూ.2000 నోట్లను ముద్రించినట్లు 2019లో ఆర్బీఐ తెలిపింది. అధిక విలువ కలిగిన నోట్ల ముద్రణను తగ్గించి, తద్వారా బ్లాక్ మనీ అడ్డుకట్ట వేసే ఉద్దేశంతోనే వీటి ముద్రణను నిలిపివేసినట్లు తెలుస్తోంది. 2016లో నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వం తొలిసారి రూ.2000 నోటును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
చెలామణిలో ఉన్న రూ.2వేల నోట్ల సంఖ్య
* 2018 మార్చి 30 నాటికి 336.2 కోట్లు
* 2021 ఫిబ్రవరి 26 నాటికి 249.9 కోట్లు
ముద్రించిన రూ.2వేల నోట్లు
* 2016 ఏప్రిల్ నుంచి 2017 మార్చి వరకు: 354.29 కోట్లు
* 2017 ఏప్రిల్ నుంచి 2018 మార్చి వరకు: 11.15 కోట్లు
* రూ.2వేల కరెన్సీ నోట్లను మొదటిసారిగా 2016 నవంబర్ లో ముద్రించారు.