వీరప్పన్ కుమార్తెకు బీజేపీలో కీలక పదవి

  • Published By: vamsi ,Published On : July 19, 2020 / 01:24 PM IST
వీరప్పన్ కుమార్తెకు బీజేపీలో కీలక పదవి

Updated On : July 19, 2020 / 1:39 PM IST

ఒకప్పుడు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ కుమార్తె విద్యారాణికి తమిళనాడు బీజేపీలో కీలక పదవి లభించింది. వీరప్పన్‌ మరణానంతరం తల్లి ముత్తులక్ష్మి ఆలనాపాలనలో విద్యావంతురాలిగా మారిన విద్యారాణి రాజకీయాల్లో ఉన్నారు.

ఈ క్రమంలోనే ఆమెకు కీలక పదవి లభించింది. వచ్చే ఏడాది తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కార్యనిర్వాహక కమిటీలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) పెద్ద మార్పులు చేస్తుండగా.. విద్యా రాణికి పార్టీ పెద్ద బాధ్యతను అప్పగించింది. బిజెపి యూత్ వింగ్ ఉపాధ్యక్షురాలిగా ఆమెను నియమించింది. విద్యా ఈ ఏడాది బిజెపిలో చేరగా.. ఇంత త్వరగా పెద్ద పదవిని పొందడం ద్వారా ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు.

బిజెపికి ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే లేరు. 29 ఏళ్ల విద్యా రాణి బి.ఏ. పూర్తి చెయ్యగా.. ఎల్‌ఎల్‌బి డిగ్రీ కూడా పొందింది. 1987లో, వీరప్పన్ చిదంబరం అనే అటవీ అధికారిని కిడ్నాప్ చేసినప్పుడు దేశాన్ని కదిలించాడు. అతను ఒక పోలీసు బృందాన్ని పేల్చి 22 మందిని చంపాడు. 2000 లో వీరప్పన్ కన్నడ చిత్రాల హీరో రాజ్‌కుమార్‌ను కిడ్నాప్ చేశాడు. 18 అక్టోబర్ 2004 న, పోలీసులు ఎన్‌కౌంటర్‌లో వీరప్పన్ చంపేశారు.