Ayodhya Ram Mandir: స్కూల్లో ప్రార్థన వేళ.. భక్తిపారవశ్యంలో మునిగి విద్యార్థులు, టీచర్ డ్యాన్స్

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Ayodhya Ram Mandir: స్కూల్లో ప్రార్థన వేళ.. భక్తిపారవశ్యంలో మునిగి విద్యార్థులు, టీచర్ డ్యాన్స్

School students dance

అయోధ్య రామ మందిరం రామయ్య ప్రాణప్రతిష్ఠకు సిద్ధమవుతోంది. ఇప్పటికే బాలరాముడి విగ్రహానికి సంబంధించిన ఫొటోలను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో యావత్ భారతదేశం భక్తిపారవశ్యంలో మునిగిపోతోంది.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ పాఠశాల విద్యార్థులు రాముడి భజన పాటకు డ్యాన్స్ చేశారు. ఉదయాన్నే ప్రార్థన సమయంలో లైన్లలో నిలబడి టీచర్‌తో కలిసి వారు డ్యాన్స్ చేసిన తీరు అలరిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ఆలయ ట్రస్టు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 22న రామయ్య ప్రాణప్రతిష్ఠకు వారం రోజుల ముందు నుంచే పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 20వ తేదీన సరయూ నది పవిత్ర జలాలతో ఆలయ గర్భగుడిని సంప్రోక్షణ చేసి.. 21న రామయ్య విగ్రహానికి 125 కలశాలతో దివ్యస్నానం చేయిస్తారు. జనవరి 22న రాముడి ప్రాణ ప్రతిష్ఠ, ఆ తర్వాత పట్టాభిషేకం జరుగుతాయి.

రామయ్య భక్తులకు ఇలాచీదాణాను ప్రసాదంగా అందించనున్నారు. వేలాదిగా తరలివచ్చే భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని అందించేందుకు ఓ కంపెనీకి ఆర్డర్‌ సైతం ఇచ్చారు. ఆలయ ప్రారంభోత్సవానికి తరలివచ్చే భక్తుల కోసం దాదాపు 5 లక్షల ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు.

రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటికే అయోధ్యకు చేరుకున్న ఇంటెలిజెన్స్‌ బృందాలు.. అనుక్షణం అప్రమత్తంగా ఉన్నాయి. మరోవైపు ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి సాంకేతికత సాయంతో నిఘా చర్యలు చేపట్టారు. డ్రోన్స్‌ను రంగంలోకి దింపారు. అయోధ్య మొత్తం సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేశారు.

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరానికి సెలబ్రిటీలు ఎంతెంత ఇచ్చారో తెలుసా?