బాంద్రా రైల్వే స్టేషన్ కి భారీగా బీహార్ వలసకూలీలు

  • Published By: venkaiahnaidu ,Published On : May 19, 2020 / 10:37 AM IST
బాంద్రా రైల్వే స్టేషన్ కి భారీగా బీహార్ వలసకూలీలు

Updated On : May 19, 2020 / 10:37 AM IST

ముంబైలోని బాంద్రా రైల్వేస్టేషన్ కి ఇవాళ(మే-19,2020)ఉదయం పెద్ద సంఖ్యలో వలసకూలీలు చేరుకున్నారు.  వలసకూలీల రాకతో రైల్వే స్టేషన్ పరిసరాలన్నీ జనసంద్రంగా మారాయి. లాక్‌డౌన్‌ ప్రభావంతో ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన వలస కార్మికులును స్వస్థలాలకు పంపించేందుకు శ్రామిక్ రైళ్ల పేరుతో ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

అయితే ఇవాళ ఉదయం రైల్వే శాఖ బీహార్‌ వలస కార్మికుల కోసం బాంద్రా నుంచి శ్రామిక్‌ స్పెషల్‌ ట్రైన్‌ ను ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం ముందుగా పేర్లు నమోదుచేసుకున్నవారు మాత్రమే రైలులో వెళ్లేందుకు అనుమతి ఉండగా..బాంద్రా రైల్వే స్టేషన్‌లో పేర్లు లేని వారు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కేవలం 1000 మందికి మాత్రమే రైలులో వెళ్లేందుకు అనుమతి ఉండగా..ఊహించని రీతిలో కార్మికులు వచ్చే సరికి పరిస్థితి అదుపుతప్పింది.

కార్మికులను తిరిగి బయటకు పంపించేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. వేల సంఖ్యలో కార్మికులతో బాంద్రా రైల్వే స్టేషన్‌ కిక్కిరిసిపోయిందని పశ్చిమరైల్వే సీపీఆర్‌వో తెలిపారు. ముంబైలోని అతిపెద్ద రైల్వే స్టేషన్ అయిన ఛత్రపతీ శివాజీ టెర్మినస్ బయట గత వారం భారీగా క్యూ ఉన్న విషయం తెలిసిందే.

గడిచిన కొన్ని వారాలుగా ముంబై నుంచి పెద్ద సంఖ్యలో వలసకార్మికులు శ్రామిక్ రైళ్ల ద్వారా స్వస్థలాలకు చేరుకున్నారు. దాదాపు 5లక్షల మంది వలసకూలీలు ఇప్పటికే రైళ్లు,బస్సుల ద్వారా ముంబై నుంచి తమ స్వస్థలాకు  వెళ్లినట్లు సోమవారం సీఎం ఉద్దవ్ ఠాక్రే చెప్పారు. వలసకూలీల బాగోగులను రాష్ట్రం చూసుకుంటున్నట్లు తెలిపారు. దాదాపు 6.5లక్షల మంది వలసకూలీలకు మూడు పూట్ల ఆహారం అందించామని,కానీ చాలామంది తమ స్వస్థలాలకు వెళ్లాలనుకుంటున్నారని ఉద్దవ్ చెప్పారు.

Read:  మ్యారేజి హాళ్ళు..చిరు వ్యాపారులకు యోగీ సర్కారు శుభవార్త