Covid Rules Easing: కరోనా అదుపులోకి రావడంతో ఆంక్షలు సడలిస్తున్న రాష్ట్రాలు
దేశంలో కరోనా కేసులు కనిష్ట స్థాయికి పడిపోవడంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు సడలిస్తున్నాయి.

Corona Gone
Covid Rules Easing: దేశంలో కరోనా కేసులు కనిష్ట స్థాయికి పడిపోవడంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు సడలిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అన్నిరకాల కరోనా ఆంక్షలు ఎత్తివేయగా.. ఢిల్లీ, మహారాష్ట్ర, సిక్కిం.. రాష్ట్రాలు కరోనా ఆంక్షలను సడలిస్తున్నాయి. కరోనా మూడో దశలో జనవరి రెండు మూడు వారాల్లో లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదు కాగా, కేవలం రెండు వారాల వ్యవధిలోనే కరోనా కేసులు తగ్గిపోయాయి. మూడో దశ తీవ్రత సమయంలోనూ.. ప్రజల్లో వైరస్ తీవ్రత కనిపించకపోవడం, మరణాల రేటు సరాసరి కంటే దిగువన ఉండడంతో ఊపిరి పీల్చుకున్న వైద్యశాఖ అధికారులు..కరోనా అదుపులో ఉన్నట్లు ప్రకటించారు.
Also read: Lata Mangeshkar: అయోధ్యలో ఒక కూడలికి “లతా మంగేష్కర్” పేరు: యోగికి మోదీ ప్రశంస
ఢిల్లీలో కరోనా ఆంక్షలు ఎత్తివేయగా..ఫిబ్రవరి 14 నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహించుకోవచ్చంటూ ప్రభుత్వం విద్యాసంస్థలకు అనుమతినిచ్చింది. వ్యాపార కేంద్రాలలోను, కార్పొరేట్ కార్యాలయాల్లోనూ పాక్షిక నిబంధనలు పాటిస్తూ..కార్యకలాపాలు సాగించవచ్చంటూ ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఇక సిక్కిం రాష్ట్రంలో కరోనా ఆంక్షలు పూర్తిగా తొలగించారు. కేంద్ర వైద్యారోగ్యశాఖ సూచనల మేరకు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి సూచనలు పాటించ వచ్చని సిక్కిం ప్రభుత్వం ప్రకటించింది. ఇది మినహా సిక్కిం రాష్ట్రంలో ఎటువంటి కరోనా ఆంక్షలు లేవు.
Also read: No Vaccine: వాక్సిన్ కు వ్యతిరేకంగా ఇతర దేశాల్లోనూ కెనడా తరహా “ఫ్రీడమ్ కాన్వాయ్” నిరసనలు
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు, పర్యాటకులకు RT-PCR టెస్ట్, వాక్సిన్ ధ్రువపత్రం కూడా అవసరం లేదని సిక్కిం ప్రభుత్వం తెలిపింది. ఇక మహారాష్ట్రలో కరోనా కేసులు పడిపోవడంతో ఆంక్షలు సడలించింది అక్కడి ప్రభుత్వం. జనసమూహాల్లో మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం సహా.. కేంద్ర వైద్యారోగ్యశాఖ సూచనలు అమల్లో ఉంటాయని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో మాస్క్ అవసరం లేదంటూ వచ్చిన వార్తలపై మహారాష్ట్ర మంత్రులు, రాజేష్ తోపే, అజిత్ పవార్, విజయ్ వాడెట్టివార్ స్పందిస్తూ.. కరోనా పూర్తిగా అంతమయ్యే వరకు ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందేనేని స్పష్టం చేశారు.
Also read: Rajasthan Police: నకిలీ వార్తల కట్టడిపై రాజస్థాన్ పోలీసుల వినూత్న ప్రచారం