చేతులెత్తేసిన బీజేపీ… మహా సీఎం సీటు శివసేనదే

మహారాష్ట్రలో రాజకీయాలు సరికొత్త మలుపును తీసుకున్నాయి. తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామని కాంగ్రెస్-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఇప్పటికే ప్రకటించడం, ప్రభుత్వాన్ని తాము ఏర్పాటు చేయం,తగినంత బలం తమకు లేదని ఇవాళ(నవంబర్-10,2019)బీజేపీ ప్రకటించడంతో మహా రాజకీయాలు మరో మలుపు తీసుకుంటున్నాయి.
తాను పట్టిన పట్టును విడవట్లేదు శివసేన. 50-50 ఫార్ములాకే కట్టుబడి ఉంది. ఈ ఫార్ములాను అంగీకరించిన పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ ఫార్ములాను అంగీకరించని భారతీయ జనతాపార్టీ చివరికి.. వెనక్కి తగ్గింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తమ వల్ల కాదని, ఇంకెవరైనా రంగంలోకి దిగవచ్చని ప్రకటించే దాకా పరిస్థితిని తీసుకొచ్చింది శివసేన.
ఈ క్రమంలో- మరోసారి 50-50 ఫార్ములా మంత్రాన్నే ఉచ్ఛరించింది శివసేన. ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నరేళ్ల కాలం పాటు పంచుకోవడానికి ముందుకు వచ్చే పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ కుండబద్దలు కొట్టారు. ఎన్సీపీ-కాంగ్రెస్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ పరోక్షంగా సంకేతాలిచ్చారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమంటూ బీజేపీ చేసిన ప్రకటన తరువాత సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. కాబోయే ముఖ్యమంత్రి శివ సేనకు చెందిన నాయకుడే అవుతాడని సంజయ్ రౌత్ పునరుద్ఘాటించారు. ఇందులో మరో మాటకు అవకాశమే లేదని అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేయాలంటూ ముంబైలో పలుచోట్ల బ్యానర్లు, పోస్టర్లు వెలిసిన విషయాన్ని ప్రశ్నించగా.. ప్రతి ఒక్కరూ అదే జరగాలని కోరుకుంటున్నారని బదులిచ్చారు. ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయాలనే విషయంపై ఇప్పుడే ఏమీ మాట్లాడ లేమని అన్నారు.