కేరళను వణికిస్తున్న షిగెల్లా వైరస్ : 11 ఏళ్ళ బాలుడు మృతి

Shigella outbreak in kerala claims life of 11 year old : కరోనా వైరస్ తో వణికిపోతున్న కేరళ రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా మరో వైరస్ ప్రజలను భయపెడుతోంది. షిగెల్లా బ్యాక్టీరియా వ్యాధి కారణంగా ఇప్పటికే ఓ 11 ఏళ్ళ బాలుడు మృతి చెందగా ఈ వ్యాధిబారిన పడిన వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దీంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. ప్రజలు జాగ్రత్తగా ఉండి తగిన ఆరోగ్య సూచనలు పాటించాలని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ ప్రజలకు సూచించారు.
షిగెల్లా వైరస్ బారిన పడిన రోగులకు డయేరియాతో పాటు జ్వరం , కడుపులో తిప్పటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కేరళలో గతంలోనే ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. పలు కేసులు నమోదయ్యాయి. షిగెల్లా అనే బ్యాక్టీరియా కారణంగా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. కలుషిత నీరు తాగడం, పాడై పోయిన ఆహారం తినటం, షిగెల్లా వ్యాధి సోకిన వ్యక్తి వాడిన మూత్ర శాలలు వాడటం వల్ల ఈవ్యాధి సంక్రమిస్తుంది.
10 ఏళ్ల లోపు చిన్నారులు ఈ వ్యాధికి త్వరగా గురయ్యే అవకాశంఉన్నట్లు నిపుణులు తెలిపారు. ఉత్తర కేరళలో ఈ తరహా కేసులు ప్రస్తుతం ఎక్కువగా బయటపడుతున్నాయి. ఇప్పటికే షిగెల్లా వ్యాధి సోకి కోజికోడ్ లో ఒక 11 ఏళ్ల బాలుడు మరణించాడు. మరో 20 మంది అస్వస్ధతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరణించిన బాలుడితో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించి వారి ఆరోగ్యపరిస్ధితిని ప్రభుత్వ వైద్యులు పరిశీలిస్తున్నారు.
కేసులు పెరగటంతో ….బ్యాక్టీరియా మూలాలాను కనిపెట్టే దిశగా కేరళప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాగా… ఈ వ్యాధి గురించి భయపడాల్సిన పనిలేదని, చికిత్సతో నయం అవుతుందని వైద్యులు ధైర్యం చెపుతున్నారు. కాచి వడగట్టిన నీటిని తాగటం, వేడిగా ఉన్న ఆహార పదార్ధాలు తినాలని వైద్యులు ప్రజలకు సూచించారు.