Shiv Sena Targets Modi :తౌక్టే తుఫాన్..ప్రధాని గుజరాత్ పర్యటనపై శివసేన ఫైర్
తౌక్టే తుఫాన్ మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతాల్లో కల్లోలం రేపగా ప్రధాని మోడీ బుధవారం కేవలం గుజరాత్ లోనే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం పట్ల శివసేన విమర్శలు గుప్పించింది.

Shiv Sena Targets Modi
Shiv Sena targets Modi తౌక్టే తుఫాన్ మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతాల్లో కల్లోలం రేపగా ప్రధాని మోడీ బుధవారం కేవలం గుజరాత్ లోనే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం పట్ల శివసేన విమర్శలు గుప్పించింది. గుజరాత్ లో సంక్షోభాన్ని ఎదుర్కోలేని అసమర్ధ నాయకత్వం ఉన్నందువల్లే ప్రధాని ఆ రాష్ట్రాన్ని ఎంచుకున్నారని సేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఏ సంక్షోభం ఎదురైనా దీటుగా ఎదుర్కోగలరని, ప్రధానికి కూడా ఈ విషయం తెలుసునని సంజయ్ రౌత్ అన్నారు.
మరోవైపు, గుజరాత్లోని తౌక్టే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మాత్రమే ప్రధాని ఏరియల్ సర్వే నిర్వహించడాన్ని ఎన్సీపీ కూడా తప్పుపట్టింది. మహారాష్ట్రాలోనూ తుఫాను ప్రభావిత ప్రాంతాలున్నాయని తెలిపింది. మహారాష్ట్ర పట్ల ప్రధాని వివక్ష చూపిస్తున్నారని ఆరోపించింది. అయితే,శివసేన,ఎన్సీపీ విమర్శలను కాషాయ పార్టీ తోసిపుచ్చింది. ప్రధాని మోదీపై దాడి చేసే బదులు మహారాష్ట్ర మంత్రులు ఎసీ గదుల నుంచి బయటకు వచ్చి ప్రజల కోసం పనిచేయాలని బీజేపీ నేత రామ్ కదమ్ హితవు పలికారు. కొంకణ్ ప్రాంతంలో తుఫాన్ తీవ్రత అధికంగా ఉన్నా మహారాష్ట్ర మంత్రులు ఏ ఒక్కరూ అక్కడ పర్యటించలేదని మండిపడ్డారు.
కాగా,తౌక్తే తుపాను కలిగించిన నష్టానికి తక్షణ ఆర్థిక సాయంగా గుజరాత్ కు కేంద్రం నుంచి రూ.1000కోట్లు అందిస్తున్నట్లు ప్రధాని మోడీ బుధవారం ప్రకటించారు. తుపాను వల్ల కలిగిన నష్టం నుంచి కోలుకునేలా గుజరాత్ కు అన్ని విధాలుగా సాయపడతామన్న ఆయన..తౌక్తే మృతుల కుటుంబాలకు తలా రూ.2లక్షల పరిహారం అందిస్తామని, గాయపడిన వారికి రూ. 50వేలు ఇస్తామని పేర్కొన్నారు. అయితే..మహారాష్ట్రకు కేంద్రం సహాయంపై ఇంకా ప్రకటన వెలువడలేదు.