ఇంద్రుడి సింహాసనం ఆఫర్ చేసినా బీజేపీకి మద్దతివ్వము

మహారాష్ట్ర రాజకీయం అనుహ్య మలుపులు తిరుగుతోంది. రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. ప్రభుత్వ ఏర్పాటు అంశం డైలీ సీరియల్ ని తలపించింది. ప్రభుత్వ ఏర్పాటుకి సంబంధించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. కాంగ్రెస్-ఎన్సీపీతో కలిసి శివసేన.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అది కూడా డిసెంబర్ 1లోపే అని సంజయ్ రౌత్ వివరించారు. శివసేనకు చెందిన వ్యక్తే సీఎం అవుతారని కాన్ఫిడెంట్ గా చెప్పారు.
అదే సమయంలో బీజేపీపై సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు చేశారు. ఇక బీజేపీతో కలిసే ప్రసక్తే లేదన్నారు. సీఎం పోస్టు కాదు కదా.. ఇంద్రుని సింహాసనం ఇస్తామని ఆఫర్ చేసినా.. బీజేపీకి మద్దతిచ్చే ప్రసక్తే లేదని సంజయ్ రౌత్ తేల్చి చెప్పారు. ఆఫర్ల టైమ్ ముగిసిపోయింది అని ఆయన కామెంట్ చేశారు. బీజేపీతో కలిసి సీఎం పదవిని షేర్ చేసుకుంటారా అని మీడియా అడిగిన ప్రశ్నకు సంజయ్ రౌత్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు.