పవర్ కోసం పవార్ తో : ఎన్సీపీ చీఫ్ ని కలిసిన శివసేన ముఖ్య నాయకుడు

  • Published By: venkaiahnaidu ,Published On : November 6, 2019 / 06:22 AM IST
పవర్ కోసం పవార్ తో : ఎన్సీపీ చీఫ్ ని కలిసిన శివసేన ముఖ్య నాయకుడు

Updated On : November 6, 2019 / 6:22 AM IST

మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కన్పిస్తోంది. సీఎం సీటు విషయంలో బీజేపీ-శివసేన మధ్య గ్యాప్ ఏర్పడిన సమయంలో ఇవాళ(నవంబర్-6,2019)శివసేన ముఖ్యనాయకుడు సంజయ్ రౌత్ ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ని కలిశారు. పవార్ నివాసానికి వెళ్లి ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. గడిచిన 10రోజుల్లో పవార్ ని సంజయ్ కలవడం ఇది మూడోసారి. 

శరద్ పవార్ రాష్ట్రంలోని సీనియర్ నాయకుడని,మహారాష్ట్రలోని రాజకీయ పరిస్థితి గురించి ఆయన ఆందోళన చెందుతున్నాడని,మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి పాలిటిక్స్ పై ఆయనతో సుదీర్ఘంగా చర్చించినట్లు సంజయ్ రౌత్ తెలిపారు. ప్రజల తీర్పుని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కుట్ర జరుగుతోందంటూ పరోక్షంగా బీజేపీని విమర్శించారు సంజయ్.

జేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైతే శివసేనతో కూడా కలిసేందుకు తాము సిద్దమేనని ఎన్సీపీ ప్రత్యక్షంగానే సంకేతాలు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై శివసేనకు ఒక షరతు విధించింది ఎన్సీపీ. బీజేపీతో బంధం పూర్తిగా తెంచుకుంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని ఎన్సీపీ తేల్చి చెప్పినట్లు సమాచారం.

గత నెల 24న వెలువడిన మహారాషట్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-శివసేన కూటిమికి స్పష్టమైన మెజారిటి వచ్చినప్పటికీ శివసేన 50:50 ఫార్ములాకు బీజేపీ ఒప్పుకోకపోవడంతో ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు కాలేదు.. ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వ కాలం నవంబర్-8,2019తో ముగుస్తుంది. అప్పటిలోగా కొత్త ప్రభుత్వం కొలువుదీరకుంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశముందని బీజేపీ నాయకులు చెబుతున్నారు.