దళితులపై దాడితో షాకయ్యా.. రాహుల్ గాంధీ ట్వీట్‌పై బీజేపీ ఎదురుదాడి!

  • Published By: sreehari ,Published On : February 20, 2020 / 06:11 PM IST
దళితులపై దాడితో షాకయ్యా.. రాహుల్ గాంధీ ట్వీట్‌పై బీజేపీ ఎదురుదాడి!

Updated On : February 20, 2020 / 6:11 PM IST

రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లాలో అమానుషం జరిగింది. ఇద్దరు దళితులను అత్యంత పాశవికంగా దాడి చేశారు. రూ.500 దొంగిలించేందుకు ప్రయత్నించారంటూ ఆరోపిస్తూ వారిద్దరిని విచక్షణ లేకుండా స్కూ డ్రైవర్ తో చిత్రహింసలు పెట్టారు టూ వీలర్ ఏజెన్సీ సిబ్బంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ప్రముఖ రాజకీయ వేత్తలు ఘాటుగా స్పందించారు. మొబైల్ వీడియోలను ఇద్దరు వ్యక్తులను దారుణంగా కొట్టడమే కాకుండా వారి జననాంగాలపై పెట్రోల్ పోయడాన్ని మొబైల్ వీడియోలో చూపించారు.

ఈ వీడియో కాస్తా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దృష్టికి వెళ్లింది. వెంటనే ఆయన తీవ్రంగా ఖండించారు. దళితులపై జరిగిన ఈ దాడి ఎంతో అమానుషమని అన్నారు. ఆ ఇద్దరు యువకులపై అమానుష దాడి నన్ను షాకింగ్‌కు గురిచేసింది. దాడి చేసిన తీరు నా ఒళ్లు గగుర్పొడిచేలా అనిపించింది. దాడికి పాల్పడిన వ్యక్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నా’ అంటూ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 

రాహుల్ గాంధీ ట్వీట్ పై బీజేపీ ఎదురుదాడికి దిగింది. పార్టీ నేత అమిత్ మాల్వియా ఒక విషయాన్ని గుర్తు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎవరిదో? అక్కడి ముఖ్యమంత్రే హోమంత్రి కూడా.. ఆయనే అశోక్ గెహ్లాట్ అని చెప్పారు. రాష్ట్రంలో దళితులపై దాడికి బాధ్యత ఎవరూ తీసుకోవాలో మీకు తెలియదా? అంటూ మాల్వియా రాహుల్ కు చురకలు అంటించారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి దళితులు, మహిళలపై నేరాలు పెరిగాయని మాల్వియా ఆరోపించారు. 

రాజస్తాన్‌కు చెందిన ఇద్దరు దళిత వ్యక్తులు నాగౌర్‌ సమీపంలోని ఓ పెట్రోల్‌ బంకులో పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి రూ. 500 దొంగతనానికి పాల్పడ్డారంటూ తోటి ఉద్యోగులు వారిపై దాడికి దిగారు. స్క్రూ డ్రైవర్‌తో చిత్ర హింసలు పెట్టారు. వారి దుస్తులు చింపేసి జననాంగాలపై పెట్రోల్‌ పోశారు. అక్కడి నుంచి బయటపడ్డ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తమపై తోటి ఉద్యోగులే దాడి చేశారని, అదంతా కెమెరాలో రికార్డు చేశారని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధిత యువకులు ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నాగౌర్ దళితుల దాడి ఘటనపై చర్యలు తీసుకున్నామంటూ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ స్పందించారు. ఇప్పటివరకూ ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. చట్టపరంగా నిందితులను శిక్షిస్తామని, త్వరలోనే బాధితులకు న్యాయం చేకూరూలే చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.