రఫెల్‌ను‌ నడిపే తొలి మహిళా పైలట్…చరిత్ర సృష్టించిన ‘శివంగి సింగ్’

  • Published By: venkaiahnaidu ,Published On : September 23, 2020 / 04:03 PM IST
రఫెల్‌ను‌ నడిపే తొలి మహిళా పైలట్…చరిత్ర సృష్టించిన ‘శివంగి సింగ్’

Updated On : September 23, 2020 / 9:36 PM IST

ఇటీవల భారత వాయుసేన (ఐఏఎఫ్‌) అంబులపొదిలోకి చేరిన అత్యాధునిక‌ రఫేల్‌ ఫైటర్‌ జెట్ నడిపే తొలి మహిళా పైలట్ ‌గా ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. రాఫెల్‌ యుద్ధ విమానాన్ని నడిపే తొలి మహిళా పైలట్‌గా ఫ్లైట్ లెఫ్టినెంట్ శివంగి సింగ్ ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

శివంగి సింగ్ త్వరలో అంబాలాలోని 17 స్క్వాడ్రన్‌కు చెందిన రాఫెల్‌ ‘గోల్డెన్ యారో‌స్‌’లో భాగం కానున్నారు. దీని కోసం ఆమె ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. ఫ్రాన్సులో తయారైన 5 రఫేల్‌ ఫైటర్‌ జెట్లు ఈనెల 10న అంబాలా వైమానిక స్థావరం కేంద్రంగా పనిచేస్తున్న గోల్డెన్‌ యారోస్‌ స్క్వాడ్రన్‌లో అధికారికంగా చేరిన విషయం తెలిసిందే.


వారణాసికి చెందిన శివంగి సింగ్ 2017లో భారత వైమానిక దళంలో చేరారు. మహిళల రెండో బ్యాచ్‌లో ఫైటర్‌ పైలట్‌గా శిక్షణ పొందారు. మిగ్‌-21 బైసన్‌ యుద్ధ విమానాలు నడిపిన అనుభవం ఆమె సొంతం. గత ఏడాది ఫిబ్రవరిలో పాకిస్థాన్‌కు చెందిన యుద్ధ విమానం కూల్చివేసిన సందర్భంగా ఆ దేశ చెరలో కొన్ని రోజులపాటు ఉన్న వింగ్‌ కమాండర్‌ అభినందన్‌తో కలిసి ఆమె..ఇటీవలే రాజస్థాన్‌లోని వైమానిక స్థావరం నుంచి యుద్ధ విమానంలోఅంబాలా ఎయిర్‌ బేస్‌ కు చేరుకున్నట్లు సమాచారం.

వారణాసిలో ప్రాథమిక విద్యనభ్యసించిన శివంగి సింగ్…చిన్ననాటి నుంచే వైమానిక దళంలో చేరాలని కలలు కనేవారు. బెనారస్‌ హిందూ యూనివర్సిటీలో చేరిన అనంతరం తన ఆశయాన్ని నెరవేర్చుకునే దిశగా అడుగులుపడ్డాయి. అక్కడే నేషనల్‌ క్యాడెట్‌ కార్స్ప్‌ 7 యూపీ ఎయిర్‌ స్వాడ్రాన్‌లో భాగస్వామ్యమయ్యే అవకాశం లభించింది. ఈ క్రమంలో 2016లో ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో చేరి శిక్షణ ప్రారంభించారు. పాతకాలపు మిగ్‌ 21 యుద్ధ విమానం నుంచి మొదలైన ఆమె శిక్షణ ప్రస్తుతం కొత్త తరం రాఫెల్‌ యుద్ధ విమానం నడపటం వరకు కొనసాగింది.


కాగా,ప్రస్తుతం భారత్‌- చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో రఫేల్‌ ఫైటర్‌ జెట్లు తూర్పు లఢఖ్ లో విధుల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.