భావిత‌రాల‌కు స్ఫూర్తి…ఆధ్యాత్మిక గురువు కేశ‌వానంద భార‌తి మృతిపై మోడీ ట్వీట్

  • Published By: venkaiahnaidu ,Published On : September 6, 2020 / 05:18 PM IST
భావిత‌రాల‌కు స్ఫూర్తి…ఆధ్యాత్మిక గురువు కేశ‌వానంద భార‌తి మృతిపై మోడీ ట్వీట్

Updated On : September 6, 2020 / 5:47 PM IST

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కేశ‌వానంద భార‌తి(79) మృతిప‌ట్ల ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. అణ‌గారిన‌ వ‌ర్గాల అభివృద్ధికి కేశవానంద చేసిన కృషిని, స‌మాజ సేవని ఎల్ల‌ప్పుడూ గుర్తుంచుకుంటామ‌ని మోడీ తెలిపారు. భార‌త‌దేశ గొప్ప సంస్కృతి, సంప్ర‌దాయాలు, రాజ్యాంగాన్ని అయన గౌర‌వించే వారని, కేశ‌వానంద భార‌తి భావితరాల‌కు స్ఫూర్తిగా నిలుస్తార‌ని మోడీ ట్వీట్ చేశారు. గత కొంతకాలంగా వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో భాదపడుతూ ఆదివారం(సెప్టెంబర్-6,2020)ఉదయం కేర‌ళ‌లోని కాసర్ గూడ్ లోని ఎడ‌నీర్ మ‌ఠ్‌లో కేశ‌వానంద భార‌తి శివైక్యం పొందిన‌ విషయం తెలిసిందే.

కాగా, ఆధ్యాత్మికవేత్తగానే కాకుండా రాజ్యాంగ హక్కులపై ఆయన చేసిన న్యాయపోరాటంతోనే దేశవ్యాప్తంగా కేశవానంద భారతి గుర్తింపు పొందారు. సుప్రీంకోర్టు కేసుల్లో స్వామి కేశవానంద భారతి కేసు చరిత్రాత్మకమైంది. కేసు కేశ‌వానంద భార‌తి వ‌ర్సెస్ స్టేట్ ఆఫ్ కేర‌ళ‌గా ప్రాచుర్యం పొందింది. పలు కేసులకు దీనినే మైలురాయిగా తీసుకుంటారు. ఏకంగా 68 రోజుల పాటు ఈ కేసు విచారణ నడిచింది. ఏకంగా 13 మంది న్యాయమూర్తులతో ఏర్పాటైన విస్తృత ధర్మాసనం ఈ కేసు విచారణను చేపట్టింది. 68 రోజుల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసు కేశవానంద భారతికి అనుకూలంగా వెలువడింది.

అసలేంటి కేసు

కేర‌ళ భూసంస్క‌ర‌ణ చ‌ట్టంపై 1973లో కేశ‌వానంద భార‌తి సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు. కేశవానంద భారతి ఆశ్రమానికి చెందిన మఠాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. 1973లో నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఎం సిక్రీ నేతృత్వంలో జేఎం షెలట్, కేఎస్ హెగ్డే, ఏఎన్ గ్రోవర్, బీ జగన్మోహన్ రెడ్డి, డీజీ పాలేకర్, హెచ్ ఆర్ ఖన్నా, ఏకే ముఖర్జీ, యశ్వంత్ విష్ణు చంద్రచూడ్, ఏఎన్ రాయ్, కేకే మాథ్యూ, ఎంహెచ్ బేగ్, ఎస్ ఎన్ ద్వివేదీ ఈ కేసును విచారించారు.

68 రోజుల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసు కేశవానంద భారతికి అనుకూలంగా వెలువడింది. రాజ్యాంగ మౌలిక స్వ‌రూపానికి సుప్రీంకోర్టు సంర‌క్ష‌ణ‌దారని తీర్పు ఇచ్చింది. 13 మంది న్యాయమూర్తుల్లో నలుగురు ఈ తీర్పును వ్యతిరేకించారు. తీర్పు ప్రతులపై సంతకాలు చేయలేదు. చరిత్ర గతినే మార్చివేసిన కేసుగా దీన్ని న్యాయ కోవిదులు అభివర్ణిస్తుంటారు.