పౌరసత్వ బిల్లు: ఢిల్లీ విద్యార్థులపై పోలీసుల దాడి

పౌరసత్వ బిల్లు: ఢిల్లీ విద్యార్థులపై పోలీసుల దాడి

Updated On : December 15, 2019 / 2:27 PM IST

పౌరసత్వ బిల్లు(సిటిజెన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్) ప్రకంపనలు ఢిల్లీలో ఆందోళనలు సృష్టిస్తున్నాయి. జామియా స్టూడెంట్స్ విభాగం ఆధ్వర్యంలో కొందరు విద్యార్ధులు విధ్వంసానికి తెగబడ్డారు. రహదారిపై నిలిపి ఉన్న వాహనాలకు నిప్పుపెట్టారు. కార్ల అద్దాలు పగలగొట్టారు. దీంతో ఆ ప్రాంతంలో వెళ్లే వాహనదారుల్లో ఆందోళన నెలకొంది.

క్యాబ్ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొంది చట్టంగా మారిన నాటి నుంచి ఢిల్లీలోనూ ఆందోళనలు సాగుతున్నాయి. తాజా ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులు పోలీసులపైనా రాళ్లు రువ్వారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. 

పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ చోటు చేసుకున్న ఈ ఆందోళనలో ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్‌కి  సంబంధించిన రెండు బస్సులు పూర్తిగా దగ్ధం అయ్యాయి. భరత్ నగర్ ఏరియాలో చోటు చేసుకున్న ఈ ఘటన జరిగిన వెంటనే ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగారు. వాటిలో ఓ ఫైర్‌ ఇంజన్‌ని కూడా జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ  స్టూడెంట్స్ అడ్డుకున్నారని తెలుస్తోంది. మరోవైపు జామియా యూనివర్సిటీని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 

పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ పశ్చిమ బెంగాల్‌లో ఆందోళనలు కొనసాగుతుండగా.. ఇక అసోంలో పరిస్థితి తీవ్రస్థాయికి చేరింది. ఈ ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇంటర్నెట్, మొబైల్ సేవలను నిషేధించింది. హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నవారికి అసోంలోని మేధావులు, కళాకారుల ఆధ్వర్యంలో వందలాదిమంది రంగంలోకి దిగారు.

కొత్త పౌరసత్వ సవరణ చట్టం మాకు వద్దంటూ నినాదాలు చేశారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన జరిగింది. త్రివేండ్రం రైల్వేస్టేషన్ వద్ద ఆ పార్టీ లీడర్ ఎంఎం హసన్ కార్యకర్తలతో కలిసి ధర్నాకి దిగారు. భారీగా కార్యకర్తలు చేరడంతో రైల్వేస్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకోగా..ప్రయాణీకులు రాకపోకలకు అంతరాయం కలగకుండా..రైల్వే పోలీసులు వారిని అడ్డుకున్నారు.