అయోధ్యలో మసీదు స్థలంపై వెనక్కి తగ్గిన సున్నీ వక్ఫ్ బోర్డు

ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బీజేపీ నాయకులు పడగొట్టడానికి ముందు చారిత్రాత్మక బాబ్రీ మసీదు శతాబ్దాలుగా నిలబడి ఉన్న భూమిపై తన వాదనను సున్నీ వక్ఫ్ బోర్డ్ విరమించుకుంది. సున్నీ వక్ఫ్ బోర్డులో ఉన్న సభ్యుల మధ్య వివాదం చెలరేగడమే దీనికి కారణమని తెలిసింది. వక్ఫ్ బోర్డు చైర్మన్ జేఏ ఫారుకిపై ఎఫ్ఐఆర్‌లు నమోదు అయినట్లు తెలుస్తోంది. వివాదస్పద అంశం నుంచి ఉపసంహరించుకోవాలని వక్ఫ్ బోర్డు నిర్ణయించినట్లు మధ్యవర్తి ప్యానెల్ సుప్రీంకోర్టుకు తెలిపింది.
వక్ఫ్ బోర్డుకు చెందిన భూములను అక్రమంగా అమ్మేశారని ఫారుకిపై యూపీ ప్రభుత్వం విచారణకు ప్రతిపాదించింది. అయితే తనకు ప్రాణహాని ఉందని ఫారుకి కోర్టును కోరడంతో ఆయనకు అదనపు భద్రత కల్పించాలని సుప్రీం ఆదేశించింది. టైటిల్ సూట్ నుంచి కేసును ఉపసంహరించాలని నిర్ణయించామని, అయోధ్యలో ఉన్న 22 మసీదుల మెయింటేనెన్స్ చూసుకోవాలని వక్ఫ్ బోర్డు ప్రభుత్వాన్ని కోరింది. అయోధ్య కేసులో విచారణను సుప్రీం నేటితో ముగించనున్నది.
చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్ నవంబర్ 17న పదవీ విరమణ చేయనుండగా, అప్పటిలోగా ఈ మైలురాయి కేసులో ధర్మాసనం తన తీర్పును ఇస్తుందని అందరూ భావిస్తున్నారు.