అన్నీ అక్టోబర్ లోనే: రాజ్యాంగ ధర్మాసనానికి ఆర్టికల్ 370 పిటిషన్లు

  • Published By: venkaiahnaidu ,Published On : August 28, 2019 / 06:43 AM IST
అన్నీ అక్టోబర్ లోనే: రాజ్యాంగ ధర్మాసనానికి ఆర్టికల్ 370 పిటిషన్లు

Updated On : August 28, 2019 / 6:43 AM IST

ఆర్టికల్‌ 370 రద్దు సహా కశ్మీర్‌ అంశంపై దాఖలైన 15 పిటిషన్లపై ఇవాళ(ఆగస్టు-28,2019) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపింది. ఆర్టికల్‌ 370 రద్దును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ కోసం ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తామని సీజేఐ స్పష్టం చేశారు.

అక్టోబరు మొదటివారంలో ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్లను విచారిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా పిటిషన్లపై తమ స్పందన తెలియజేయాలంటూ కేంద్రం, జమ్ముకశ్మీర్‌ పాలనాయంత్రాంగానికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. 

కశ్మీర్‌లో మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలంటూ కశ్మీర్‌ టైమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ అనురాధ బేసిన్‌ వేసిన పిటిషన్‌ను కూడా సుప్రీం కోర్టు విచారించింది. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్రంతో పాటు జమ్మూకశ్మీర్‌ పాలనా యంత్రాంగానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. అందుకు వారం రోజుల గడువు విధించింది.

ఆర్టికల్ 370 రద్దు కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా  జమ్మూకశ్మీర్ లో  మీడియా, ఇంటర్నెట్‌, మొబైల్‌ సేవలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. గతంలో దీనిపై విచారణ జరిపిన కోర్టు కేంద్రానికి కొంత సమయం ఇవ్వాలని నిర్ణయించింది. అయినా ఇంకా కొన్ని చోట్ల ఆంక్షలు కొనసాగుతుండడంపై ప్రభుత్వాన్ని కోర్టు  వివరణ కోరింది.