కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తేసిన స్పీకర్

ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలను సభ నియమావళిని ఉల్లంఘిస్తూ.. సమావేశాలను అడ్డుకుంటున్నారన్న కారణంతో ఈ నెల 5న లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ఈ నెల 5న సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తక్షణమే ఈ ఏడుగురిపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు స్పీకర్ బుధవారం(మార్చి-11,2020) ప్రకటించారు. సస్పెన్షన్ ఎత్తివేతకు సంబంధించిన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది.
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఢిల్లీలో జరిగిన అల్లర్లపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టాయి. విపక్షాల డిమాండ్ పై స్పీకర్ స్పందిస్తూ.. మార్చి 11న చర్చ చేపడుతామని చెప్పారు. అయినప్పటికీ కాంగ్రెస్ ఎంపీలు వినకుండా ఉద్దేశపూర్వకంగానే వెల్‌లోకి దూసుకెళ్లారని… స్పీకర్ పోడియంపై ఉన్న పేపర్లను లాక్కొని చించేశారన్న కారణంతో వారిని సస్పెండ్ చేశారు. దీంతో కాంగ్రెస్ ఎంపీలు గౌరవ్ గొగోయ్, టీఎన్ ప్రతాపన్, డీన్ కురియాకోస్, మనిక్క ఠాగూర్, రాజ్‌మోహన్ ఉన్నిధన్, బెన్ని బెహనన్, గుర్జీత్‌సింగ్ ఆవ్‌జ్లాను సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేవరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని మార్చి 5న స్పీకర్ ప్రకటించారు.
అయితే ఇవాళ లోక్ సభలో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సస్పెన్షన్ ఎత్తివేతకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి సభ మూజువాణి ఓటుతో ఆమోదించడంతో.. వారిపై సస్పెన్షన్ తక్షణమే ఎత్తివేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.