మమతకి షాక్…తృణముల్ ఎమ్మెల్యే రాజీనామా

Suvendu Adhikari Quits As MLA త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వెస్ట్ బెంగాల్ లో ఇప్పటికే ఎన్నికల వేడి తారాస్థాయిలో రాజుకుంది. ఎలాగైనా సరే రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ, శాసనసభ ఎన్నికల్లోనూ తన మార్కు చూపించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. కాగా, అధికారాన్నికాపాడుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్ (TMC) శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్ ఎటాక్ ఎపిసోడ్ సహా ఇప్పటికే పలు అంశాల్లో కేంద్రం వర్సెస్ మమత అన్నట్లుగా ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
మరో4-5నెలల్లో 294స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బెంగాల్‌లో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. మమతా బెనర్జీతో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో గత నెలలో రవాణాశాఖ మంత్రి పదవికి, హూగ్లీ రివర్ బ్రిడ్జి కమిషన్ చైర్మన్ పదవికి కూడా టీఎంసీ ముఖ్య నేత “సువెందు అధికారి” రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇవాళ(డిసెంబర్-16,2020) సువేందు తన ఎమ్మెల్యే పదవికి కూడా సువెందు రాజీనామా చేశారు.
బుధవారం మధ్యాహ్నం సువెందు స్వయంగా అసెంబ్లీకి వెళ్లి తన రాజీనామాను సమర్పించారు. తృణమూల్ కాంగ్రెస్ విధానాలతో విభేదిస్తూ సువెందు.. గత కొ్న్ని రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఏ కార్యక్రమానికి హాజరైనా పార్టీ గుర్తింపు చిహ్నాలు ఏవీ లేకుండానే పాల్గొంటున్నారు. అయితే, అనేకమంది తనను విమర్శిస్తున్నారని, కానీ తన నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశం తెలిశాక వారికి కనువిప్పు కలుగుతుందని సువెందు పేర్కొన్నారు.
కాగా, త్వరలోనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి సువెందు బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతున్నది. ఆయనతో బాటు అసన్ సోల్ మాజీ మేయర్ జితేంద్ర తివారీ, అటవీ శాఖ మంత్రి రాజీబ్ బెనర్జీ వంటివారు కూడా కాషాయ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ వారాంతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ పర్యటన సందర్భంగా సువెందు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తున్నది. కోల్ కతాకి 150 కిలోమీటర్ల దూరంలోని మిడ్నపూర్ జిల్లాలోని మెడిన్ పూర్ టౌన్ లో సువెందు అధికారి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు.
మరోవైపు, టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ మొదటిసారిగా పార్టీలో అసమ్మతి ఉన్నట్టు అంగీకరించారు. అయితే అసమ్మతివాదులను సహించేది లేదని, బీజేపీ.నేతల ఎత్తుగడలను వారు గ్రహించి తమ వైఖరిని మార్చుకుంటారని ఆశిస్తున్నానని ఆమె చెప్పారు. రాష్ట్రంలో వచ్ఛే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీని ఓడించేందుకు బీజేపీ పన్నుతున్న కుట్రలు తమకు తెలుసునని, అందుకే మాటిమాటికీ ఆ పార్టీ అగ్రనేతలు రాష్ట్రాన్ని సందర్శిస్తున్నారని దీదీ పేర్కొన్నారు. ఇటీవల ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్ పై జరిగిన దాడి గురించి మళ్ళీ ప్రస్తావించిన ఆమె.. వీడియోల కోసం ఈ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.