Acid Attack On Girl : ఢిల్లీలో బాలికపై యాసిడ్ దాడి ఘటన.. ఫ్లిప్ కార్ట్ కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ
ఢిల్లీలో 17 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడి ఘటనలో ఫ్లిప్ కార్ట్ కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. నిబంధనలను ఉల్లంఘించి ఆన్ లైన్ లో యాసిడ్ అమ్మినందుకు గానూ వివరణ ఇవ్వాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

acid attack girl
Acid Attack On Girl : ఢిల్లీలో 17 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడి ఘటనలో ఫ్లిప్ కార్ట్ కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. నిబంధనలను ఉల్లంఘించి ఆన్ లైన్ లో యాసిడ్ అమ్మినందుకు గానూ వివరణ ఇవ్వాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఏడు రోజుల్లో ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ల్లో యాసిడ్ లభ్యతపై నెలకొన్న భయాందోళనలను పరిష్కరించడానికి అవసరమైన పత్రాలతోపాటు ప్రతి స్పందనను తెలపాలని కేంద్ర మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సీసీపీఏ కోరింది.
ఆన్ లైన్ లో యాసిడ్ ను అమ్మడం నిబంధనలను అతిక్రమించడమేనని పేర్కొంది. ఈ నెల 14న ఢిల్లోని 17 ఏళ్ల బాలిపై జరిగిన దాడి ఘటనలో నిందితులు ఫ్లిప్ కార్ట్ లో యాసిడ్ ను కొనుగోలు చేశారు. దీంతో ఢిల్లీ మహిళా కమిషన్ కూడా ఈ-కామర్స్ వేదికలైన ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లకు నోటీసులు జారీ చేసిన సంగతి విధితమే. బుధవారం ఉదయం 9 గంటలకు చెల్లెలుతో కలిసి స్కూల్ కు వెళ్తోన్న 17 ఏళ్ల బాలికపై ఇద్దరు యువకులు యాసిడ్ దాడి చేశారు.
ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లోని మోహన్ గార్డెన్ సమీపంలో బాధితురాలు వెళ్తున్న సమయంలో ముఖానికి ముసుగులతో బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులు నడిరోడ్డుపై బాలికపై యాసిడ్ దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు సఫ్దార్ జంగ్ ఆస్పత్రికి తరలించారు.
ముఖంతోపాటు కళ్లలో కూడా యాసిడ్ పడిందని డాక్టర్లు తెలిపారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వెల్లడించారు. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.