River linking: నదుల అనుసంధానం వేగవంతం.. కేంద్ర జలశక్తి శాఖ కీలక సమావేశం

దేశవ్యాప్తంగా నదుల అనుసంధాన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని భావిస్తుంది కేంద్రం.

River linking: నదుల అనుసంధానం వేగవంతం.. కేంద్ర జలశక్తి శాఖ కీలక సమావేశం

River

Updated On : February 15, 2022 / 9:48 PM IST

River linking: దేశవ్యాప్తంగా నదుల అనుసంధాన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని భావిస్తుంది కేంద్రం. ఫిబ్రవరి 18న ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ ఇందుకోసం కీలక సమావేశం ఏర్పాటు చేస్తుంది. గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై 5 రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ సమావేశం అయ్యింది.

జాతీయ నీటి అభివృద్ధి సంస్థ నేతృత్వంలో నిర్వహించే ఈ సమావేశానికి హాజరు కావాలని ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి జలవనరుల శాఖ కార్యదరులకు ఆదేశాలు జారీచేసింది కేంద్రం. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో శ్రమ శక్తి భవన్​లో మధ్యాహ్నం 3గంటలకు సమావేశం జరగబోతుంది.

గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టును త్వరితగతిన చేపట్టేందుకు కార్యాచరణ ప్రారంభించిన నేషనల్ వాటర్ డెవలప్​మెంట్ ఏజెన్సీ.. గోదావరి-కృష్ణా-పెన్నా-కావేరీ నదుల అనుసంధానం ద్వారా ఏపీ, తెలంగాణ, తమిళనాడులోని వివిధ ప్రాంతాల నీటి అవసరాలను పెద్ద ఎత్తున తీర్చేందుకు ఆస్కారం ఉంటుందని భావిస్తుంది.

ఈ ప్రాజెక్టులో భాగస్వాములైన రాష్ట్రాలతో సంప్రదింపులు జరపనుంది కేంద్ర జలశక్తి శాఖ. గోదావరిలోని ఇచ్చంపల్లి బ్యారేజీ నుంచి నాగార్జున సాగర్, సోమశిల, తమిళనాడులోని గ్రాండ్ ఆనికట్ వరకు నదులను అనుసంధానించబోతుంది కేంద్రం. తద్వారా తెలంగాణలోని నల్గొండ, ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు తమిళనాడులోని తిరువళ్లూర్, వెల్లోర్, తిరువణ్ణామలై, విల్లుపురం, కడలూర్, కాంచీపురం లాంటి ప్రాంతాలకు నేరుగా అనుసంధానం కానున్నాయి నీటి ప్రాజెక్టులు.

ఇక ఉప ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాలు, ఏపీలోని గుంటూరు, తమిళనాడులోని తంజావూర్ జిల్లాలకు ప్రయోజనం కలగనుంది. నాగార్జున సాగర్​తో పాటు మూసీ డ్యామ్ వద్ద జలవిద్యుత్ ప్రాజెక్టులు కూడా చేపట్టే అవకాశముందని భావిస్తుంది కేంద్ర జలశక్తి శాఖ. ఈ అనుసంధానానికి తొలిదశలో 85 వేల కోట్ల రూపాయల మేర నిధులు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నది కేంద్ర జలశక్తి శాఖ.

మహానది నుంచి వృథాగా సముద్రంలో కలుస్తున్న జలాలను గోదావరికి అటు నుంచి కృష్ణా, పెన్నా నదులకు అనంతరం కావేరీ నదికి అనుసంధాన కాలువల ద్వారా మళ్లించే అవకాశముందని చెబుతోంది జలశక్తి శాఖ. ఈ అనుసంధాన ప్రాజెక్టు ద్వారా ఏపీ, ఒడిశా, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరిలకు ప్రయోజనం కలగబోతుంది.

తొలిదశలో గోదావరిలోని ఇచ్చంపల్లి నుంచి కావేరీ వరకు 247 టీఎంసీల నీటిని మళ్లించే అవకాశముందని చెబుతోంది జలశక్తి శాఖ. నదుల అనుసంధానం ద్వారా గోదావరి బేసిన్​తో పాటు ఇతర బేసిన్​లలోని 9,44,572 హెక్టార్ల సాగులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. 1.40 లక్షల మందికి తాగునీరు, అలాగే పారిశ్రామిక అవసరాలకు నీటిని సరఫరా చేసే అవకాశముందని భావిస్తోంది కేంద్ర జలశక్తి శాఖ. 85 వేల కోట్లు ఖర్చు అయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా 1 కోటీ 35 లక్షల కోట్ల సంపద సృష్టికి ఆస్కారం ఉందని అంచనా వేస్తుంది కేంద్ర జలశక్తి శాఖ.