Ghulam Nabi Azad: కాంగ్రెస్‌కు షాకిస్తున్న నేతలు.. ఆజాద్ బాటలో మరికొందరు ..
కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీలోని పలువురు సీనియర్ నేతలు షాక్‌లమీద షాక్‌లు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీని వీడిన తరువాత మరికొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు, పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తున్నారు.

Ghulam Nabi Azad
Ghulam Nabi Azad: కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీలోని పలువురు సీనియర్ నేతలు షాక్‌లమీద షాక్‌లు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీని వీడిన తరువాత మరికొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు, పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తున్నారు. గులాం నబీ ఆజాద్ వైదొలగిన తరువాత జమ్మూ కాశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.
దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు తోడు, 2024లో పార్లమెంట్ ఎన్నికల గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ వీడటం ఆ పార్టీకి గట్టిదెబ్బే. అయితే ఆజాద్ పార్టీని వీడే క్రమంలో రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ సోనియా గాంధీకి ఐదు పేజీల లేఖను పంపించారు. రాహుల్ ను విమర్శించడం పట్ల ఆజాద్ తీరుపై పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు విమర్శలు గుప్పించారు. ఆయన రాహుల్ పై విమర్శలు చేయడాన్ని తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్‌తో సహా పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలు ఆజాద్ కు మద్దతుగా నిలుస్తున్నారు.
Ghulam Nabi Azad: రెండు వారాల్లో గులాంనబీ ఆజాద్ కొత్త పార్టీ.. అనుచరుడి వెల్లడి
ఆదివారం కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన ఒక మాజీ కాంగ్రెస్ నాయకుడు GM సరూరి, జమ్మూ అండ్ కాశ్మీర్ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నుండి కూడా ఢిల్లీలోని గులాం నబీ ఆజాద్ ప్రధాన కార్యాలయంకు వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ఉండాలా, పార్టీని వీడాలా అనేదానిపై చర్చలు జరుపుతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీరిలో ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన వారు ఉండగా, మరికొందరు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైన వారు ఉన్నట్లు సమాచారం. శుక్రవారం పార్టీని వీడిన వారిలో మాజీ ఎమ్మెల్యే ఆర్‌ఎస్ చిబ్, జుగల్ కిషోర్ శర్మ, చౌదరి అక్రమ్, మహ్మద్ అమీన్ భట్, గుల్జార్ అహ్మద్ వానీ, హాజీ అబ్దుల్ రషీద్, నరేష్ గుప్తాలు ఉన్నారు. ఇదిలాఉంటే ఆజాద్ జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టేందుకు కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.