Maharashtra Covid-19 Task Force : నాలుగు వారాల్లో థర్డ్ వేవ్ ముప్పు!

మహారాష్ట్ర లేదా ముంబైకి రాబోయే 2-4 వారాల్లోనే కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంద‌ని కొవిడ్-19పై ఉద్దవ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ హెచ్చ‌రించింది.

Maharashtra Covid-19 Task Force : నాలుగు వారాల్లో థర్డ్ వేవ్ ముప్పు!

Maharashtra Covid 19 Task Force

Updated On : June 17, 2021 / 4:07 PM IST

Maharashtra Covid-19 Task Force మహారాష్ట్ర లేదా ముంబైకి రాబోయే 2-4 వారాల్లోనే కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంద‌ని కొవిడ్-19పై ఉద్దవ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ హెచ్చ‌రించింది. మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియెంట్ వల్ల థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని టాస్క్‌ఫోర్స్ హెచ్చరించింది. థర్డ్ వేవ్ నేపథ్యంలో క‌రోనా క‌ట్ట‌డికి చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే అధ్య‌క్ష‌త‌న బుధవారం జ‌రిగిన స‌మీక్షా స‌మావేశంలో టాస్క్‌ఫోర్స్ త‌మ అంచ‌నాలు వెల్ల‌డిస్తూ సీఎంకి ఓ రిపోర్ట్ సమర్పించింది.

మ‌హారాష్ట్ర‌లో డెల్టా ప్లస్ వేరియెంట్‌తో థర్డ్ వేవ్ త‌లెత్తుతుంద‌ని, సెకండ్ వేవ్ లో న‌మోదైన కేసుల‌తో పోలిస్తే థ‌ర్డ్ వేవ్ లో రెట్టింపు కేసులు న‌మోద‌వుతాయ‌ని రిపోర్ట్ లో పేర్కొన్నారు. థర్డ్ వేవ్ వస్తే 8లక్షల వరకు యాక్టివ్ కేసులు ఉండవచ్చని.. అందులో 10శాతం వరకు పిల్లలే ఉండవచ్చని కొవిడ్ టాస్క్‌ఫోర్స్ పేర్కొంది. ఈ నేపథ్యంలో అంత మందికి ట్రీట్‌మెంట్ ఇచ్చేలా ముందస్తు సన్నద్ధత కావాలని సూచిస్తున్నారు.

బ్రిట‌న్ లో సెకండ్ వేవ్ తర్వాత నాలుగు వారాల్లోగా థ‌ర్డ్ వేవ్ వ్యాప్తి చెందింద‌ని కొవిడ్-19 నిబంధ‌న‌లు పాటించ‌కుండా, స‌న్న‌ద్ధ‌తతో లేకుంటే మ‌నం కూడా ఇదే ప‌రిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని టాస్క్‌ఫోర్స్ స‌భ్యుడు డాక్ట‌ర్ శ‌శాంక్ జోషి పేర్కొన్నారు. థర్డ్ వేవ్‌ను దృష్టిలో ఉంచుకొని ముందే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని,సెరో సర్వే, వ్యాక్సిన్‌ పంపిణీలను వేగవంతం చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.