జైల్లో చిదంబరం : మొదటి రోజు..ముభావంగా

  • Published By: madhu ,Published On : September 6, 2019 / 03:29 PM IST
జైల్లో చిదంబరం : మొదటి రోజు..ముభావంగా

Updated On : September 6, 2019 / 3:29 PM IST

మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన కేంద్రమాజీ మంత్రి చిదంబరం..తీహార్ జైల్లో ముభావంగా గడుపుతున్నారట. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఎదుర్కొంటున్న చిదంబరం..ఇప్పుడు ఏ గదిలో అయితే ఉన్నారో..అందులోనే ఆయన కుమారుడు కార్తి చిదంబరం కూడా ఏడాది క్రితం గడపడం విధి విచిత్రం అనాలేమో. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ తండ్రీ కొడుకులు ఇద్దరూ ఒకటే కేసులో ఒకే జైలులో ఒకే గదిలో ఏడాది గ్యాప్‌తో గడపాల్సి రావడంపై సోషల్ మీడియాలోనూ సైటైర్లు పేలుతున్నాయ్. ఇక మొదటిరోజు జైల్లో ఆయనకి నిద్రపట్టలేదని..సెల్లో రెస్ట్‌లెస్‌గా గడిపారని జైలు సిబ్బంది చెబుతున్నారు. 

UPA 2 హయాంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన చిదంబరం..ఇప్పుడు జైలుపాలు కావడం ఆయన పరువుని బజారు పడేసినట్లే అంటున్నారు కొందరు. ఇక ఆయన సెప్టెంబర్ 06వ తేదీ శుక్రవారం ఉదయం తెల్లవారు ఝామునే లేచి కాసేపు వాకింగ్ చేశారని..తర్వాత ధ్యానం..పూజలు చేశారంట. జైల్లో చిదంబరానికి బ్రేక్ ఫాస్ట్‌గా పొరిడ్జ్..అంటే పాలతో కలిపిన ఓట్స్‌ని జైలు సిబ్బంది ఇచ్చారు. తర్వాత చిదంబరం ఓ లైట్ టీ తీసుకున్నారట. ఆ తర్వాత ఆయన కాసేపు న్యూస్ పేపర్లు తిరగేస్తూ కాలం గడిపారని తెలుస్తోంది. 

చిదంబరం వీఐపీ ఖైదీనే అయినా…ఆయనకి జైల్లో ప్రత్యేకమైన సదుపాయాలేమీ కల్పించలేదు. తీహార్ జైల్లోని లైబ్రరీకి వెళ్లడానికి మాత్రం పర్మిషన్ ఉంది. అలానే ఖైదీల కోసం ఏర్పాటు చేసిన టీవిని చూడొచ్చు. ప్రతి రోజూ సాయంత్రం తన లాయర్లతో మాట్లాడటానికి మాత్రం కోర్టు అనుమతి ఇచ్చింది. మొత్తం పద్నాలుగు రోజుల కస్టడీలో చిదంబరం దినచర్య ఇలానే ఉంటుందని..పెద్దగా మార్పులు ఉండబోవని తీహార్ జైలు సిబ్బంది చెబుతున్నారు.