పౌరసత్వ బిల్లుపై నిరసనలు..24గంటలు ఇంటర్నెట్ బంద్

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు పెల్లుబుకుతున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రల్లో ఈ బిల్లుపై తీవ్ర నిరసనలు,ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అసోం,త్రిపుర రాష్ట్రాల్లో మంగళవారం ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. 11గంటల పాటు బంద్ కు ఈశాన్య రాష్ట్రాల్లోని స్టూడెంట్ గ్రూప్ లు పిలుపునిచ్చాయి. ఈ సమయంలో త్రిపుర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
24గంటలపాటు రాష్ట్రంలో మొబైల్ ఇంటర్నెట్,ఎస్ఎంఎస్ సర్వీసులను బ్లాక్ చేయాలని బిప్లబ్ దేబ్ సర్కార్ డిసైడ్ అయింది. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచారం చేసి తద్వారా అలజడులు సృష్టించాలని కొన్ని శక్తలు ప్రయత్నిస్తున్నాయంటూ పోలీసులు కనుగొన్నారని,దీని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ అధికారి తెలిపారు.
మరోవైపు ఈ బిల్లుకు నిరసనగా సోమవారం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఆలిండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ వంటి సంస్థలు దేశ రాజధానిలో వేర్వేరు చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. రాజ్యాంగ విరుధ్ధమైన ఈ బిల్లును తాము ఖండిస్తున్నామని, ఇది హిందూ-ముస్లిం ఐక్యతను దెబ్బ తీసేదిగా ఉందని ఏఐడీయుఎఫ్ నేత, ఎంపీ కూడా అయినా బద్రుద్దీన్ అజ్మల్ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈ సంస్థ సభ్యులు జంతర్ మంతర్ రోడ్డులో ఆందోళన నిర్వహించారు. అలాగే ముస్లిం లీగ్ కు చెందిన ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర నిరసనకు కూర్చున్నారు. అయితే ఇప్పటికే పౌరసత్వ సవరణ బిల్లు లోక్ సభ ఆమోదం పొందగా,బుధవారం మధ్యాహ్నాం ఈ బిల్లును ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది.