TamilNadu stampede : తమిళనాడు తొక్కిసలాట ఘటన.. 39కి చేరిన మృతులు.. ఘటనపై స్పందించిన దళపతి విజయ్.. ఘటనకు కారణాలివే..

TVK Vijay rally Stampede : తమిళనాడు తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. మరో 50మంది గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

TamilNadu stampede : తమిళనాడు తొక్కిసలాట ఘటన.. 39కి చేరిన మృతులు.. ఘటనపై స్పందించిన దళపతి విజయ్.. ఘటనకు కారణాలివే..

TVK Vijay rally Stampede

Updated On : September 28, 2025 / 7:50 AM IST

TVK Vijay rally Stampede : తమిళనాడులో ఘోర విషాద ఘటన జరిగింది. కరూర్‌లో సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ ప్రచారసభ సందర్భంగా శనివారం రాత్రి తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. వీరిలో 16మంది మహిళలు, ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారు. మరో 50మందికిపైగా గాయపడగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక అధికారులు తెలిపారు. వీరికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.

Also Read: Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటన.. సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి.. అధికారులకు కీలక ఆదేశాలు..

తొక్కిసలాట ఘటనలో గాయపడి కరూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ పరామర్శించారు. మృతదేహాలకు నివాళులర్పించిన స్టాలిన్.. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారంను స్టాలిన్ ప్రకటించారు. మరోవైపు ఈ ఘటనపై విచారణ జరిపేందుకు మద్రాస్‌ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ అరుణా జగదీశన్‌ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు.

తొక్కిసలాట ఘటనపై టీవీకే అధ్యక్షుడు విజయ్ స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. కరూర్ ఘటనతో నా హృదయం ముక్కలైంది. మాటలతో చెప్పలేని వేదనలో మునిగిపోయా. ఈ బాధ భరించలేనిది, వర్ణించలేనిది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడి చికిత్స పొందుతున్నవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అంటూ విజయ్ పేర్కొన్నారు. అయితే, తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ కరూర్ నుంచి చెన్నైకి వెళ్లిపోయారు. చెన్నై ఎయిర్ పోర్టులో మీడియా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ విజయ్ మౌనంగా వెళ్లిపోయారు. తొక్కిసలాట ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత సోషల్ మీడియా ఖాతాలో ఆయన పోస్ట్ పెట్టారు.


తొక్కిసలాటకు అనేక కారణాలు ఉన్నాయని పరిస్థితిని బట్టి చూస్తే అర్ధమవుతుంది. కరూర్ ర్యాలీకి 10వేల మంది జనం వస్తారని టీవీకే వర్గాలు అంచనా వేశాయి. ప్రభుత్వం వద్ద అదే విషయాన్ని చెప్పి టీవీకే ప్రతినిధులు అనుమతి తీసుకున్నారు. కానీ, చివరికి అంతకు మూడు రెట్లు జనం విజయ్ సభకు రావడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు తలకుమించిన భారంగా మారింది.
మరోవైపు.. సభ వద్దకు విజయ్ ఆలస్యంగా రావడంకూడా ఈ ఘటనకు మరోకారణంగా స్థానికులు చెబుతున్నారు. దాదాపు ఆరు గంటలకుపైగా ప్రజలు విజయ్ కోసం వేచి ఉండాల్సి వచ్చిందని, దీనికితోడు ఆ ప్రాంతంలో భారీగా జనం గుమిగూడటంతో ఉక్కపోత, రద్దీ కారణంగా అప్పటికే వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
విజయ్‌ ప్రసంగిస్తున్న సమయంలో తమ అభిమాన నటుడైన విజయ్‌ను దగ్గర నుంచి చూడాలన్న ఆత్రుతతో కొందరు వేదిక వద్దకు దూసుకొచ్చేందుకు యత్నించారని ఈ కారణంగా కొందరు కిందపడిపోవడంతో పాటు.. తొక్కిసలాటకు దారితీసిందని పలువురు చెబుతున్నారు.
మరోవైపు.. ఆ ర్యాలీలో ఓ బాలిక కనిపించకుండా పోవడంతో ఆమె కుటుంబ సభ్యులు వెతడకడం ప్రారంభించారు. ఇది కూడా అక్కడ గందరగోళానికి దారి తీసినట్లు తెలుస్తోంది.
తొక్కిసలాట పరిస్థితిని తన ప్రచార వాహనంపై నుంచి గమనించిన విజయ్.. వెంటనే తన ప్రసంగాన్ని ఆపేసి జనంపైకి నీళ్ల సీసాలు విసిరేశారు. ఇక గాయపడిన వారిని తరలించేందుకు అక్కడికి వచ్చే అంబులెన్సులకు దారి ఇవ్వాలని వారిని కోరారు.