జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. రామ్‌నాథ్ కోవింద్ కమిటీ చేసిన కీలక సూచనలు ఇవే..
ఈ అంశాన్ని కొలిక్కి తెచ్చేందుకు రామ్ నాథ్ కోవింద్ కమిటీని ఏర్పాటు చేశారు. వివిధ అంశాలను పరిశీలించిన కమిటీ.. అందరితో చర్చలు జరిపి నివేదికను సిద్ధం చేసింది.

One Nation One Election : జమిలి ఎన్నికలపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. రామ్ నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు ఆమోద ముద్ర వేసింది. శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు ఈ బిల్లు తీసుకొచ్చే అవకాశం ఉంది. గతేడాది నుంచే వన్ నేషన్ – వన్ ఎలక్షన్ పై ప్రభుత్వం దృష్టి సారించింది.
2024 ఎన్నికలు కూడా జమిలి పద్ధతిలో నిర్వహించాలని భావించారు. కానీ, సాధ్యపడలేదు. ఈ అంశాన్ని కొలిక్కి తెచ్చేందుకు రామ్ నాథ్ కోవింద్ కమిటీని ఏర్పాటు చేశారు. వివిధ అంశాలను పరిశీలించిన కమిటీ.. అందరితో చర్చలు జరిపి ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. దీనికి ఆమోద ముద్ర వేసిన కేంద్రం.. జమిలి ఎన్నికల నిర్వహణకు ముందడుగు వేసింది.
జమిలి ఎన్నికలకు కోవింద్ కమిటీ రెండంచెల విధానాన్ని సూచించింది. తొలుత లోక్ సభ, రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో పోలింగ్ నిర్వహించాలని పేర్కొంది. ఆ తర్వాత 100 రోజులకు మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఎన్నికలు జరపాలని నివేదికలో తెలిపింది. ఇందుకోసం రాజ్యాంగంలో కనీసం 5 ఆర్టికల్స్ సవరించాలని కమిటీ సూచించింది. ఇక మూడు స్థాయిల ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా ఉండాలని తెలిపింది.
Also Read : అన్ని పేజర్లు ఎలా పేలిపోయాయి? ఇది మొసాద్ గతంలో చేసిన ఆపరేషన్ల వంటిదేనా?
దాదాపు 190 రోజుల పాటు ఈ అంశంపై కమిటీ అధ్యయనం జరిపింది. పలు రంగాల నిపుణులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది. 47 రాజకీయ పార్టీలు దీనిపై తమ అభిప్రాయాలు తెలిపాయి. ఇందులో 32 జమిలికి మద్దతిచ్చాయి. ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు కమిటీ కోరగా.. 21వేల 558 స్పందనలు వచ్చాయి. వీరిలో 80శాతం మంది ఏకకాల ఎన్నికలను సమర్థించారు. ఇవన్నీ అధ్యయనం చేసిన తర్వాత నివేదికను రూపొందించింది కమిటీ.
ఏకకాల ఎన్నికల నిర్వహణపై గత కొన్నేళ్లుగా బలంగా ప్రచారం చేస్తున్న మోదీ సర్కార్.. 2023 సెప్టెంబర్ లో దీనిపై కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్ గా మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను నియమించింది. కేంద్రమంత్రి అమిత్ షా, లోక్ సభలో విపక్ష నేత అదిర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్ కే సింగ్, లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీలను కమిటీలో సభ్యులుగా చేర్చింది. ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, కమిటీ సెక్రటరీగా కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నితిన్ చంద్రలకు బాధ్యతలు అప్పగించింది.