కరోనా నుండి విముక్తి కోసం : ఆగష్టు-15న ప్రతిజ్ఞ చేయండి…మన్ కీ బాత్ లో మోడీ పిలుపు

  • Published By: venkaiahnaidu ,Published On : July 26, 2020 / 03:09 PM IST
కరోనా నుండి విముక్తి కోసం : ఆగష్టు-15న ప్రతిజ్ఞ చేయండి…మన్ కీ బాత్ లో మోడీ పిలుపు

Updated On : July 26, 2020 / 4:04 PM IST

కార్గిల్ విజయ్ దివస్ వేళ జవాన్ల శౌర్య, పరాక్రమాలపై ప్రశంసలు కురిపించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. కార్గిల్‌ యుద్ధంలో అమరులైన వీర సైనికులకు, వారికి జన్మనిచ్చిన తల్లులకు దేశ ప్రజలందరి తరపున వందనం సమర్పిస్తున్నానని ప్రధాని తెలిపారు.

దేశ ప్రజలను ఉద్దేశించి మన్‌ కీ బాత్‌లో ప్రసంగించిన మోడీ…దేశాన్ని స్థిరంగా రక్షించిన సాయుధ దళాల ధైర్యం, సంకల్పం మరువలేమన్నారు. కార్గిల్‌ యుద్ధంలో భారత సైనికులు చూపిన పరాక్రమాన్ని యావత్‌ ప్రపంచం చూసింది. ఆ యుద్ధంలో సైనికులు చూపిన త్యాగం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. దేశ సమగ్రతకు సైనికులు చూపే ధైర్య సాహసాలకు వందనం. సైనికుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరవదు. జవాన్ల ధైర్య సాహసాలకు దేశం కృతజ్ఞతలు తెలుపుతోంది. 21 సంవత్సరాల క్రితం ఇదే రోజు మన సైన్యం కార్గిల్‌ యుద్ధంలో గెలిచింది అని మోడీ గుర్తు చేశారు.

యువత..నాటి కార్గిల్ వీరుల పరాక్రమాలు, వీరమాతల త్యాగాలకు సంబంధించిన కథనాలను ఇతరులకు షేర్ చేయాలన్నారు మోడీ. సైనికుల సంక్షేమం కోసం ఏదైనా చేయాలని అన్నారు. భారత్‌ ఎప్పుడూ స్నేహపూర్వక సంబంధాల కోసమే ప్రయత్నిస్తోంది. అంతర్గత సంఘర్షణల నుంచి దృష్టి మరల్చేందుకు ఆనాడు పాక్‌ దురాలోచన చేసింది. కుట్రపూరితంగా భారతదేశ భూభాగాన్ని ఆక్రమించాలనే దుస్సాహసం పాకిస్తాన్‌ చేసిందని మోడీ తెలిపారు. తమకు మేలు చేసే వారికి కూడా అకారణంగా కీడు చేసేందుకు ఆలోచిస్తూ ఉండడమే దుష్టుల స్వభావమని ప్రధాని పేర్కొన్నారు.

వాజ్​పేయీ వ్యాఖ్యలు అనుసరణీయం

దేశ రక్షణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు.. జవాన్ల గురించి యోచించాలన్న వాజ్​పేయీ వ్యాఖ్యలు సదా ఆచరణీయమన్నారు. కార్గిల్ సమయంలో ఎర్రకోట నుంచి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్​పేయీ చేసిన ప్రసంగం ఇప్పటికీ అనుసరణీయమన్నారు మోడీ. ఏ కీలక నిర్ణయమైనా తీసుకునేముందు సైనికుల ప్రయోజనాలు కూడా ఆలోచించాలని వాజ్​పేయీ పేర్కొన్నట్లు చెప్పారు.

కార్గిల్​ స్ఫూర్తితో కరోనాను ఎదుర్కోవాలి..ఆగస్టు-15 న ప్రతిజ్ఞ చేయాలి 

దేశంలో కరోనా రికవరీ రేటు పెరిగిందన్న ప్రధాని.. కార్గిల్​ స్ఫూర్తితో కరోనాను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. .ఐక్య పోరుతోనే..గత కొద్దినెలలుగా కరోనాపై భారత్ ఐక్యంగా పోరాడుతోందని చెప్పారు మోడీ . ఈ కారణంగానే పలు దేశాల కంటే రికవరీ రేటు ఎక్కువగా ఉందని వెల్లడించారు. ప్రారంభంలో ఉన్నంత ప్రమాదకరంగానే వైరస్ ప్రభావం ప్రస్తుతం కూడా ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మహమ్మారి నియంత్రణ దిశగా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలి. మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలిన అని తెలిపారు.

దేశం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకునే ఆగస్టు 15 న మహమ్మారి నుండి స్వేచ్ఛ కోసం ప్రతిజ్ఞ చేయాలని పౌరులను కోరారు మోడీ. కరోనావైరస్ నేపథ్యంలో ఈ సంవత్సరం, ఆగస్టు 15 వేడుకలు కూడా చాలా భిన్నమైన పరిస్థితులలో ఉంటాయి. ఈ స్వాతంత్య్ర దినోత్సవం రోజున మహమ్మారి నుండి స్వేచ్ఛ కోసం ప్రతిజ్ఞ చేయమని యువతను, నా దేశ ప్రజలను నేను కోరుతున్నాను అని మన్ కీ బాత్ లో మోడీ చెప్పారు. 13 లక్షలకు పైగా కేసులతో, అమెరికా మరియు బ్రెజిల్ తరువాత ప్రపంచ కరోనావైరస్ జాబితాలో భారత్ మూడవ స్థానంలో ఉంది.

రక్షా బంధన్
రక్షా బంధన్ రానున్న వేళ శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని. స్థానికంగా ఉన్నవారితోనే రాఖీ వేడుకలను జరుపుకోవాలని మోడీ తెలిపారు.

ఆగస్టు 7న జాతీయ హ్యాండ్లూమ్ డే
ఆగస్టు 7న జాతీయ చేనేత వస్త్ర వేడుకలు జరుపుకోనున్నట్లు గుర్తు చేశారు ప్రధాని మోదీ. పౌరులు చేనేత వస్త్రాల ఉపయోగాన్ని పెంచి స్వదేశీ తయారీకి ప్రోత్సాహం కల్పించాలన్నారు మోడీ.