ట్రంప్ టారిఫ్ ప్రభావం భారత్‌పై ఎలా ఉండనుంది? ప్రస్తుతం ఏం జరుగుతోంది? అమెరికా టారిఫ్‌పై పార్లమెంట్‌లో పీయూష్ గోయల్ ప్రకటన

ట్రంప్ చర్యల ప్రభావం గురించి ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని, దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ట్రంప్ టారిఫ్ ప్రభావం భారత్‌పై ఎలా ఉండనుంది? ప్రస్తుతం ఏం జరుగుతోంది? అమెరికా టారిఫ్‌పై పార్లమెంట్‌లో పీయూష్ గోయల్ ప్రకటన

Updated On : July 31, 2025 / 7:39 PM IST

భారత్‌ నుంచి చేసుకునే దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25 శాతం టారిఫ్‌లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ట్రంప్ భారత్, రష్యాపై విమర్శలు చేశారు.

“రష్యాతో భారత్ ఎలాంటి సత్సంబంధాలు పెట్టుకున్నా నేను పట్టించుకోను. ఆ రెండు దేశాలు కలిసి తమ బలహీన ఆర్థిక వ్యవస్థలను మరింత దిగజార్చుకోవచ్చు. భారత్‌తో మనం చాలా తక్కువ వాణిజ్యం చేశాం.. వారి టారిఫ్‌లు చాలా ఎక్కువగా ఉన్నాయి, ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి. అలాగే, రష్యాతో కూడా మనకు వాణిజ్యం లేనట్టే. ఈ వైఖరినే కొనసాగిద్దాం” అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు.

ట్రంప్ టారిఫ్‌లతో భారత్‌లో పలు రంగాలు ప్రభావితమవుతాయని నిపుణులు చెబుతున్నారు. భారత ప్రధాన ఎగుమతులలో స్మార్ట్‌ఫోన్లు, ఔషధాలు, రత్నాలు, వస్త్రాలు, పారిశ్రామిక యంత్రాలు ఉన్నాయి. అత్యధికంగా జువెలరీ, సముద్రాహార ఉత్పత్తులపై ప్రభావం పడే అవకాశం ఉంది. భారత జువెలరీ రంగం గత సంవత్సరం $10 బిలియన్ విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసింది.

ఐఫోన్ల తయారీపై ట్రంప్ టారిఫ్‌లు పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. భారత ఉత్పత్తులపై ట్రంప్ 25 శాతం టారిఫ్‌లు విధించినా ఐఫోన్ల తయారీలో భారత్ ప్రధాన కేంద్రంగా మారుతుందన్న విషయాన్ని ఈ సుంకాలు అంతగా ప్రభావితం చేయవు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ఉత్పత్తులపై కఠినమైన టారిఫ్‌లు విధించిన తర్వాత రూపాయి విలువ రికార్డుస్థాయిలో కనిష్ఠానికి చేరింది. స్టాక్ ఇండెక్సులు పడిపోయాయి. దీని వలన భారత వృద్ధిపై నిరంతర ఒత్తిడి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 25 శాతం టారిఫ్‌లు భారత వృద్ధిని 2025-26లో 40 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చని అంచనా.

Also Read: ఘోర రోడ్డు ప్రమాదంలో బార్బీ డిజైనర్లు మారియో పగ్లినో, గియానీ గ్రాస్సీ మృతి

పార్లమెంట్‌లో పీయూష్ గోయల్ స్పందన
ట్రంప్ టారిఫ్‌పై కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఇవాళ లోక్‌సభలో, ఆపై రాజ్యసభలో మాట్లాడారు. ట్రంప్ చర్యల ప్రభావం గురించి ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని, దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఏప్రిల్ 2న ట్రంప్ పరస్పర టారిఫ్‌లపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారని, మూడు రోజుల తరువాత 10 శాతం బేస్‌లైన్ టారిఫ్ అమలులోకి వచ్చిందని గోయల్ చెప్పారు. బేస్‌లైన్ టారిఫ్‌తో కలిపి భారత్‌పై అదనపు డ్యూటీ 26 శాతంగా నిర్ణయించారని తెలిపారు. టారిఫ్‌లను మొదట 90 రోజులపాటు నిలిపివేశారని, ఆపై ఆగస్ట్ 1 వరకూ పొడిగించారని చెప్పారు.

“భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం లక్ష్యంగా మార్చిలో చర్చలు ప్రారంభించాయి. మొదటి దశను 2025 అక్టోబర్-నవంబర్ నాటికి ముగించాలనే ఉద్దేశంతో ఈ చర్చలు జరుగుతున్నాయి. మార్చిలో న్యూఢిల్లీలో మొదటి ప్రత్యక్ష సమావేశం నిర్వహించారు. న్యూఢిల్లీ, వాషింగ్టన్ డి.సి.లో మరో నాలుగు సమావేశాలు జరిగాయి. వర్చువల్ సమావేశాలు కూడా నిర్వహించారు.

గత ఘటనల ప్రభావాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఎగుమతిదారులు, పరిశ్రమతో సంప్రదింపులు జరుపుతోంది. రైతులు, కార్మికులు, వ్యాపారవేత్తలు, ఎగుమతిదారులు, ఎంఎస్‌ఎంఈలు, ఇతర పరిశ్రమల సంక్షేమాన్ని కాపాడడం, ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రాధాన్యత. జాతీయ ప్రయోజనాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం” అని మంత్రి చెప్పారు. భారత్‌ కొన్ని సంవత్సరాలలో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుందని అన్నారు.