Uttar Pradesh Elections 2022 : అధికారం కోసం అఖిలేష్… పదవి నిలబెట్టుకునేందుకు యోగి యత్నాలు

దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్నికలు ఉత్తర్‌ప్రదేశ్. 2022 మేలో అసెంబ్లీ గడువు ముగుస్తుంది. ఫిబ్రవరి-మార్చిలో ఎన్నికలు నిర్వహిస్తే మే నాటికి ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ పూర్తికాను

Uttar Pradesh Elections 2022 : అధికారం కోసం అఖిలేష్… పదవి నిలబెట్టుకునేందుకు యోగి యత్నాలు

Uttar Pradesh Elections 2022

Updated On : January 8, 2022 / 5:28 PM IST

Uttar Pradesh Elections 2022 :  కొత్త సంవత్సరం ఎన్నికల నామ ఏడాదిగా మారనుంది. దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నగారా మోగించింది. ఏడు విడతల్లో  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు మే 14తో ముగుస్తుండగా, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీల కాల పరిమితి మార్చితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తాజా నోటిఫికేషన్‌ను వెలువరించింది.

యూపీలో ఏడు దశలు, మణిపూర్‌లో రెండు దశలు, గోవా, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాలే ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో అధికారం నిలబెట్టుకోవడంతో పాటు పంజాబ్‌లోనూ విజయం సాధించి.. సార్వత్రిక సమరానికి సిద్ధమవ్వాలని కమలనాధులు భావిస్తుండగా బీజేపీని ఢీకొట్టేందుకు రాజకీయ పార్టీలు సిధ్దంగా ఉన్నాయి. దేశంలో కోవిడ్ ,ఒమిక్రాన్ కేసులు విజృంభిస్తున్నప్పటికీ.. ఎన్నికల నిర్వహణకే ఈసీ మొగ్గు చూపింది.

ఉత్తర ప్రదేశ్ 
దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్నికలు ఉత్తర్‌ప్రదేశ్. 2022 మేలో అసెంబ్లీ గడువు ముగుస్తుంది. ఫిబ్రవరి-మార్చిలో ఎన్నికలు నిర్వహిస్తే మే నాటికి ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ పూర్తికానుంది. అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో గెలుపు బీజేపీకి అత్యవసరం. ఓ రకంగా యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పాలనపై ప్రజలు ఇచ్చే తీర్పు.. సార్వత్రిక ఎన్నికల గమనాన్ని నిర్దేశించనుంది. యూపీలో నామినేటడ్ స్థానంతో కలిపి మొత్తం 404 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజార్టీ 202.

Uttar Pradesh

Uttar Pradesh

2017 ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన బీజేపీకి ప్రస్తుతం 303 స్థానాలున్నాయి. ఇదే మ్యాజిక్ రిపీట్ చేయాలని ప్రధాని మోదీ, అమిత్ షా, యోగీ భావిస్తున్నారు. యూపీ గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. యూపీ ఎన్నికలే లక్ష్యంగా ఇటీవలే ప్రధాని కాశీ కారిడార్ ప్రారంభించారు. పూర్తిగా రెండు రోజులు పర్యటించి.. యూపీని బీజేపీ ఎంత కీలకంగా భావిస్తోందో సంకేతాలిచ్చారు.

రైతు ఉద్యమం, ఐదేళ్లలో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అత్యాచార ఘటనలు, దిగజారిన శాంతి భద్రతలు బీజేపీ విజయంపై ప్రభావం చూపుతాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సెకండ్ వేవ్ విజృంభణ, కరోనా మరణాలు ఎక్కువగా ఉండడం ప్రభుత్వ వైఫల్యమే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తన్నాయి. అయితే లక్నో సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చడం, మెట్రో సర్వీసులు, రహదారుల విస్తరణ వంటి అభివృద్ధికార్యక్రమాలు, కాశీ ఆలయం విస్తరణ, అయోధ్య రామాలయం బీజేపీకి ఓట్ల వర్షం కురిపిస్తుందన్న భావనలో ఉన్నారు కమలం నేతలు.

Also Read : 5 State Elections : ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

బీజేపీకి ఎస్పీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. మిత్రపక్షాలను కలుపుకుని పోటీచేస్తూ బీజేపీకి సవాల్ విసిరేందుకు సిద్ధమయ్యారు ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్ యాదవ్. ఎస్పీ తమ విజయావకాశాలకు గండికొడుతుందన్న భావనలో బీజేపీ ఉందని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎస్పీకి సన్నిహితుడైన కాన్పూర్ పెర్ఫ్యూమ్ వ్యాపారవేత్త పీయూష్ జైన్‌ ఇంటిపై జీఎస్టీ అధికారుల దాడులు, భారీగా నగదు స్వాధీనం లాంటి పరిణామాలన్నీ ఎస్పీని దెబ్బ తీసేందుకే అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అటు కాంగ్రెస్ ఒంటరిగా బరిలో దిగుతోంది. రాష్ట్రంలో మరో ప్రధాన పార్టీ అయిన బీఎస్పీ ప్రభావం ప్రస్తుతం పెద్దగా కనిపించకపోయినప్పటికీ.. ఎన్నికల నాటికి.. మాయావతి తన మార్క్ చూపించనున్నారు. ప్రస్తుత అసెంబ్లీలో ఎస్పీకి 49, బీఎస్పీకి 15, కాంగ్రెస్‌కు 7, ఇతర పార్టీలకు 21 స్థానాలు ఉన్నాయి.

ఉత్తర్‌ప్రదేశ్ లో
మొత్తం స్థానాలు 404
ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్థానాలు 202
అధికారంలో బీజేపీ
బీజేపీకి 303 స్థానాలు
ఎస్పీకి 49 స్థానాలు
బీఎస్పీకి 15 స్థానాలు
కాంగ్రెస్‌కు 7 స్థానాలు
ఒంటరిగా పోటీచేస్తున్న బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ
మిత్రపక్షాలతో కలిసి పోటీచేస్తున్న ఎస్పీ