Asaduddin Owaisi : అతిక్ అహ్మద్ సోదరుల హత్యలకు ప్రభుత్వమే కారణం : అసదుద్దీన్ ఒవైసీ

హత్యలు జరుపుకునే సమాజంలో నేర న్యాయ వ్యవస్థ వల్ల ఉపయోగం ఏమిటి? అని ప్రశ్నించారు. యూపీలో రూల్ ఆఫ్ లా లేదా రూల్ బై గన్? అని నిలదీశారు.

Asaduddin Owaisi : అతిక్ అహ్మద్ సోదరుల హత్యలకు ప్రభుత్వమే కారణం : అసదుద్దీన్ ఒవైసీ

Asaduddin Owaisi

Updated On : April 16, 2023 / 9:50 AM IST

Asaduddin Owaisi : ఉత్తరప్రదేశ్ లో గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్, అష్రఫ్‌ను ముగ్గురు దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. అతిక్ అహ్మద్ సోదరుల హత్యలపై ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. యూపీలో శాంతిభద్రతల పరిరక్షణలో సీఎం యోగి విఫలమయ్యారనడానికి ఈ ఘటనే నిదర్శనం అన్నారు. అతిక్ అహ్మద్ సోదరుల హత్యలకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.

అతిక్, అతని సోదరుడు పోలీసు కస్టడీలో ఉండగా చంపబడ్డారని, జేఎస్ఆర్ నినాదాలు కూడా చేశారని పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్ రాజ్‌ని జరుపుకునే వారు కూడా ఈ హత్యకు సమానంగా బాధ్యులన్నారు. హత్యలు జరుపుకునే సమాజంలో నేర న్యాయ వ్యవస్థ వల్ల ఉపయోగం ఏమిటి? అని ప్రశ్నించారు. యూపీలో రూల్ ఆఫ్ లా లేదా రూల్ బై గన్? అని నిలదీశారు.

Atiq Ahmed : బిగ్ బ్రేకింగ్.. యూపీలో కాల్పుల కలకలం.. గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ హతం

మరోవైపు అతిక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్‌ హత్యలపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా స్పందించారు. యూపీలో నేరాలు తారా స్థాయికి చేరాయన్నారు. నేరగాళ్ల నైతిక స్థైర్యం ఎక్కువగా ఉందని చెప్పారు. పోలీసు సిబ్బంది భద్రత మధ్య కాల్చి చంపబడినప్పుడు సాధారణ ప్రజల భద్రత పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దీని వల్ల ప్రజల్లో భయాందోళన వాతావరణం ఏర్పడుతోందని పేర్కొన్నారు. కొందరు కావాలనే ఇలాంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.

2005 బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఉమేష్ పాల్ హత్య కేసులో అతీక్ అహ్మద్ నిందితుడిగా ఉన్నాడు. శనివారం రాత్రి ప్రయాగ్‌రాజ్‌లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా అతీక్ అహ్మద్, అష్రఫ్‌ను కాల్చి చంపారు. వైద్య పరీక్షల కోసం అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ ను పోలీసులు తీసుకెళ్తున్నారు. ఆ సమయంలో అక్కడికి మీడియా వచ్చింది. గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు.

UP CM Yogi Govt : యూపీలో యోగి మార్క్ గోలీమార్.. ఆరేళ్లలో 183 మంది ఎన్‌కౌంటర్‌

ఇంతలో వెనుక నుంచి కాల్పుల శబ్ధం వినిపించింది. దుండగులు నేరుగా అతిక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ పై కాల్పులు జరిపారు. దీంతో వారిద్దరు అక్కడికక్కడే మరణించారు. పోలీసు కస్టడీలో ఉండగానే వారిపై దుండగులు కాల్పులు జరిపారు. కాల్పులకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈ కాల్పులకు పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

మరోవైపు గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ సోదరుల హత్యలతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. యూపీలో హై అలర్ట్ ప్రకటించింది. యూపీలో అన్ని జిల్లాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. పోలీసు అధికారులు హై అలర్ట్‌గా ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా శాంతిభద్రతలు కాపాడాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

Atiq Ahmed : నిన్న కొడుకు నేడు తండ్రి.. గ్యాంగ్‎స్టర్ అతిక్ అహ్మద్ హతం

అతిక్ సోదరుల హత్యలపై పుకార్లను పట్టించుకోవద్దని యోగి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పుకార్లను ఎవరూ పట్టించుకోవద్దని, పుకార్లు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం యోగి హెచ్చరించారు. అతీక్ అహ్మద్ సోదరుల హత్యలపై అర్థరాత్రి పోలీస్ ఉన్నతాధికారులతో యోగి అదిత్యనాథ్ సమీక్ష జరిపారు.