UP CM Yogi Govt : యూపీలో యోగి మార్క్ గోలీమార్.. ఆరేళ్లలో 183 మంది ఎన్‌కౌంటర్‌

మాఫియాను మట్టిలో కలిపేస్తా..గ్యాంగ్ స్టర్స్ గుండెల్లో నిద్రపోతానంటున్నారు యూపీ సీఎం యోగీ.. వరుస ఎన్ కౌంటర్లతో మాఫియాకు నిద్రలేకుండా చేస్తున్న ఈ కాషాయ బాబా గోలీమార్ అంటూ హెచ్చరిస్తున్నారు. నేరస్థులు వెంటాడి వేటాడి తుదముట్టిస్తున్నరాు.

UP CM Yogi Govt : యూపీలో యోగి మార్క్ గోలీమార్.. ఆరేళ్లలో 183 మంది ఎన్‌కౌంటర్‌

Uttar Pradesh CM Yogi Adityanath

UP CM Yogi Govt : నేరస్తులకు చుక్కలు చూపిస్తున్నా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. హంతకుల పీచమణిచేలా పోలీసులకు పూర్తిస్థాయిలో పవర్స్ ఇచ్చారు. కరడుగట్టిన క్రిమినల్స్ కూడా యోగి దెబ్బకు హడలెత్తిపోతున్నారు. గోలీమార్‌ అంటున్న యోగి సర్కార్‌ హయాంలో ఈ ఆరేళ్లలో 183 మంది ఎన్‌కౌంటర్‌ అయ్యారు. వీరిలో కరడుగట్టిన క్రిమినల్స్‌, రేపిస్టులే ఎక్కువ. మోస్ట్‌వాండెట్‌ క్రిమినల్‌ వికాస్‌దూబే ఎన్‌కౌంటర్‌తో యూపీలో ఉన్న క్రిమినల్‌ గ్యాంగ్‌లన్నీ తోకముడిచాయి.

2017లో తొలిసారిగా సీఎం అయిన యోగి గ్యాంగ్‌స్టర్స్ యాక్ట్ తీసుకొచ్చారు. మాఫియా ముఠాలు, క్రిమినల్స్‌, గూండా, రౌడీల్లో ఏ ఒక్కరినీ ఉపేక్షించటంలేదు. యోగి ఆదేశాలతో ఆరేళ్లలో 10వేలకు పైగా ఎన్‌కౌంటర్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో183 మంది మరణించారు. 50 వేల మంది క్రిమినల్స్‌ ఆస్తులను సీజ్ చేశారు పోలీసులు. గూండా యాక్ట్ కింద ఈ ఆరేళ్లలో 23 వేల మందిని జైలుకు పంపారు. చెప్పినట్లుగా విన్నవారిని అరెస్టు చేసి జైలుకు పంపగా, అడ్డంగా విర్రవీగిన వారు ఎన్‌కౌంటర్లలో అంతమయ్యారు. రౌడీల ఏరివేత కార్యక్రమంలో 4 వేల 911 మంది గాయపడ్డారు. వీరిలో 14 వందల 24 మంది పోలీసులు కూడా ఉన్నారు.

యోగి అధికారంలోకి రాగానే 2017లో జరిగిన ఎన్‌కౌంటర్లలో 28 మంది మరణించారు. ఆ మరుసటి ఏడాది 41 మంది హతమయ్యారు. 2019లో 34 మంది, ఆ తర్వాత వరుసగా రెండేళ్లు 52 మంది ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది 14 మంది ఎన్‌కౌంటర్‌ అయితే.. ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే 14 మంది అంతం అయ్యారు. దురదుష్టవశాత్తూ క్రిమినల్స్‌ ఏరివేతలో 13 మంది పోలీసులు కూడా అమరులయ్యారు.

ఈ ఎన్‌కౌంటర్‌ లెక్కలు చూసుకుని అయినా అతీక్‌ అహ్మద్‌ తగ్గలేదు. ఎమ్మెల్యే రాజుపాల్‌ హత్య కేసులో న్యాయవాది ఉమేశ్‌పాల్‌ సాక్ష్యం చెబితే తనకు శిక్షపడుతుందని భావించి కుమారుడు అసద్‌ను పంపి ఉమేశ్‌ను పట్టపగలే హత్యచేశాడు. పట్టపగలు.. ఓ న్యాయవాదిని.. అందరూ చూస్తుండగా కాల్చివేయడం యోగినీ తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. సీఎం కోపానికి నిదర్శనంగా హత్య జరిగిన 50 రోజుల్లో నలుగురు నిందితులు పోలీసుల చేతుల్లో హతమయ్యారు. అతిక్‌ అహ్మద్‌ 40ఏళ్ నేరచరిత్రలో తాజ గడ్డుపరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదు. గత ప్రభుత్వాల్లో అతడి ఆగడాలకు అడ్డే లేనట్లు చెలరేగిపోయాడు. అదే ధీమాతో ఉమేశ్‌పాల్ హత్య చేయించాడు. ఫలితంగా 19 ఏళ్ల కుమారుడు అసద్‌ పోలీసుల తూటాలకు బలైపోయాడు. లా డిగ్రీ చదువుతున్న అసద్‌ ఎన్‌కౌంటర్‌తోనైనా అతిక్‌లో మార్పు వస్తుందని ఆశిస్తున్నారు పోలీసులు.

అతిక్‌ మాఫియాపై ఉక్కుపాదం మోపిన యోగి ప్రభుత్వం అతడికి చెందిన 350 కోట్ల రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకుంది. అతిక్, అతని అనుచరులు బలవంతంగా ఆక్రమించుకున్న 751 కోట్ల రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించింది ప్రభుత్వం. మొత్తం మీద నేరగాళ్లకు సింహస్వప్నంగా మారిన యోగి సర్కార్ మాఫియా ముఠాలను కూకటివేళ్లతో పెకిలించేందుకు దూకుడు ప్రదర్శిస్తోంది. ఇది ఇక ముందు కూడా కొనసాగే అవకాశం ఉంది.