Atiq Ahmed : బిగ్ బ్రేకింగ్.. యూపీలో కాల్పుల కలకలం.. గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ హతం

Atiq Ahmed : ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. కాల్పులు జరిపిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Atiq Ahmed : బిగ్ బ్రేకింగ్.. యూపీలో కాల్పుల కలకలం.. గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ హతం

Atiq Ahmed (Photo : Google)

Atiq Ahmed : ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో కాల్పుల కలకలం చెలరేగింది. గ్యాంగ్ స్టర్, పొలిటీషియన్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ ఈ కాల్పుల్లో హతమయ్యారు. ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. కాల్పులు జరిపిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

సంచలనం రేపిన ఉమేశ్ పాల్ హత్య కేసులో గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ నిందితుడిగా ఉన్నాడు. వైద్య పరీక్షల నిమిత్తం అతిక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ ను పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. అదే సమయంలో అక్కడికి మీడియా వచ్చింది. గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతలో వెనుక నుంచి కాల్పుల శబ్దం వినిపించింది.

దుండగులు నేరుగా అతిక్ అహ్మద్, అతడి సోదరుడిపై కాల్పులు జరిపారు. దాంతో వారిద్దరూ స్పాట్ లోనే చనిపోయారు. పోలీసు కస్టడీలో ఉండగానే వారిపై కాల్పులు జరిపారు దుండగులు. కాల్పులకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ కాల్పుల ఘటన ప్రయాగ్ రాజ్ లో ప్రస్తుతం సంచలనమైంది. పాయింట్ బ్లాంక్ రేంజ్ లో దుండగులు కాల్పులు జరిపారు.(Atiq Ahmed)

రెండు రోజుల క్రితమే (ఏప్రిల్ 13) అతిక్ అహ్మద్ కొడుకు అసద్ అహ్మద్ ని ఝాన్సీ ప్రాంతంలో పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఈ ఎన్ కౌంటర్ సంచలనం రేపింది. అది జరిగిన 48 గంటలకే తండ్రి అతిక్ అహ్మద్ కూడా హతమయ్యాడు. ఉమేశ్ పాల్ హత్య కేసులో అతిక్ అహ్మద్ పై ఆరోపణలు ఉన్నాయి.

అతిక్ అహ్మద్ కొడుకుని యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎన్ కౌంటర్ చేసి మట్టుబెట్టారు. కిడ్నాప్ లు, మర్డర్ లు, బలవంతపు వసూళ్లు సహా అనేక నేరాలకు పాల్పడ్డాడు అతిక్ అహ్మద్. కాగా, పొలిటీషియన్ గానూ ఉన్నాడు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా అతిక్ అహ్మద్ గెలవడం విశేషం. అతిక్ పై అనేక కేసులు ఉన్నాయి. దీనిపై విచారణ జరుగుతోంది. నేర విచారణకు అధికారులే భయపడే పరిస్థితి ఉంది. యూపీలో యోగి సర్కార్ వచ్చాక క్రిమినల్స్ పై ఉక్కుపాదం మోపారు. వందల సంఖ్యలో నేరస్తులను ఎన్ కౌంటర్ చేశారు.

Also Read..UP CM Yogi Govt : యూపీలో యోగి మార్క్ గోలీమార్.. ఆరేళ్లలో 183 మంది ఎన్‌కౌంటర్‌

Also Read..Yogi Adityanath: క్రిమినల్స్ వెన్నులో వణుకుపుట్టిస్తున్న యోగి.. మాఫియాను మట్టిలో కలిపేస్తానని ప్రతిజ్ఞ

Also Read..Uttar Pradesh: ఎన్‭కౌంటర్‭లో అతిక్ అహ్మద్ కొడుకు, సహాయకుడు హతం.. యూపీలో కలకలం

ఫిబ్రవరిలో న్యాయవాది ఉమేశ్ పాల్ దారుణ హత్యకు గురయ్యారు. సంచలనం రేపిన ఈ హత్య కేసులో నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసిన యోగి సర్కార్.. మాఫియా డాన్ అతీక్ కు నరకం అంటే ఎలా ఉంటో చూపించింది. అతీక్ మూడో కుమారుడు, న్యాయవాది ఉమేశ్ పాల్ హత్య కేసు నిందితుడు అసద్ ఎన్ కౌంటర్ తో మాఫియా ముఠా గుండెల్లో వణుకుపుట్టించారు పోలీసులు.

నేరాలే వృత్తిగా చేసుకుని వ్యాపారాలు, రాజకీయాలు నడిపిన అతిక్.. ఉత్తరప్రదేశ్ లో విర్రవీగిపోయాడు. తనకు అడ్డొచ్చిన వారిని హతమారుస్తూ సినీ విలన్ పాత్రను ప్రయాగ్ రాజ్ లో ప్రత్యక్షంగా చూపాడు. యోగి అధికారంలోకి వచ్చాక అతీక్ పై ఉన్న కేసులను తిరగదోడి జైలుకి పంపారు. జైల్లో ఉన్నా అతీక్ అరాచకాలు అగలేదు. జైల్లో ఉంటూనే వ్యాపారులను, అధికారులను బెదిరించి నేరాలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే అతడిని గుజరాత్ లోని సబర్మతి జైలుకి తరలించింది యూపీ ప్రభుత్వం.(Atiq Ahmed)

రాష్ట్రానికి దూరంగా పంపినా అతీక్ అరాచకాలకు అంతులేకుండా పోయింది. 2005లో ఎమ్మెల్యే రాజ్ పాల్ హత్య కేసులో సాక్షిగా ఉన్న న్యాయవాది ఉమేశ్ పాల్ ను కిడ్నాప్ చేసి బెదిరించాడు అతీక్. ఈ కేసు విచారణలో ఉండగానే ఫిబ్రవరిలో న్యాయవాది ఉమేశ్ పాల్ ను పట్టపగలు కాల్చి చంపారు అతీక్ అహ్మద్ గ్యాంగ్. ఈ గ్యాంగ్ లో ఐదుగురు సభ్యులు ఉంటే, అతిక్ మూడో కుమారుడు అసద్ గ్యాంగ్ లీడర్ గా పని చేశాడు. నడిరోడ్డులో అంతా చూస్తుండగానే.. ఉమేశ్ పాల్ ను కాల్చి చంపడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. యూపీలోనూ పెద్ద చర్చ జరిగింది. సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం యోగి.. ఆ మరునాడు అసెంబ్లీలో మాఫియాను అంతం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. మాఫియాను మట్టిలో కలిపేంతవరకు నిద్రపోను అని ప్రకటించారు.

ముఖ్యమంత్రి యోగి అన్నట్లే.. ఉమేశ్ పాల్ హత్య కేసులో నిందితులు ఒక్కొక్కరుగా అంతమయ్యారు. యోగి అసెంబ్లీలో ప్రతినబూనిన వారం రోజుల్లోనే ఇద్దరు నిందితులు హతమయ్యారు. ఆ తర్వాత ఏప్రిల్ 13 అతిక్ అహ్మద్ కుమారుడు అసద్, అతడి సహచరుడు ఎన్ కౌంటర్ లో హతమయ్యారు.

ఇక ఉమేశ్ పాల్ హత్య కేసులో నిందితులుగా ఉన్న అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ లను కూడా పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తారనే ప్రచారం జరిగింది. చివరికి.. శనివారం రాత్రి 11.30గంటల ప్రాంతంలో వారు దారుణ హత్యకు గురయ్యారు. ఉమేశ్ పాల్ కిడ్నాప్ కేసులో జీవితఖైదు పడిన అతీక్ అహ్మద్ గుజరాత్ జైల్లో ఉన్నాడు. మరో కేసులో విచారణ నిమిత్తం గురువారం ప్రయాగ్ రాజ్ కోర్టులో అతీక్ ను హాజరుపరిచారు.

కాగా, కుమారుడి ఎన్ కౌంటర్ తో అతీక్ అహ్మద్ కన్నీరుమన్నీరయ్యారు. తనకు ప్రాణభిక్ష పెట్టాలని మాఫియా డాన్ అతీక్ అహ్మద్ యూపీ ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. ఇంతలో దుండుగులు జరిపిన కాల్పుల్లో అతీక్ అహ్మద్ హతమయ్యాడు.