ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు మంత్రులకు కరోనా పాజిటివ్

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వంలోని ఇద్దరు సీనియర్ మంత్రులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి రాజేంద్ర ప్రతాప్ సింగ్‌తో పాటు ఆయన భార్య, కొడుకు, కోడలు, మనవరాళ్లకు కరోనా సోకింది. చికిత్స నిమిత్తం మంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యులు సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చేరారు.
ఆయూష్ శాఖ మంత్రి ధరమ్ సింగ్ సైనీ కూడా కరోనా బారినపడ్డారు. దగ్గుతో బాధపడుతున్న ధరమ్‌సింగ్‌కు పరీక్ష చేయగా కోవిడ్-19 పాజిటివ్‌గా తేలిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ధరమ్‌సింగ్ పిలాఖిని మెడికల్ కాలేజ్‌లో చేరారు. మంత్రితో కాంటాక్ట్ అయిన 27 మంది శాంపిల్స్‌ను పరీక్ష కోసం పంపారు. సీనియర్ సమాజ్‌వాదీ ఎమ్మెల్యే రామ్ గోవింద్ చౌధురికి కరోనా సోకడంతో ఆయన కూడా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.