Viral Video: ఓరి మీ దుంపతెగ.. కూల్ డ్రింక్స్‌ను కూడా వదలరా? కల్తీ చేస్తున్న వీడియో వైరల్

నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలో.. కొందరు వ్యక్తులు ఓ కంపెనీకి చెందిన కూల్ డ్రింక్స్ బాటిల్స్ లో నకిలీ డ్రింక్ నింపుతున్నారు.

Viral Video: ఓరి మీ దుంపతెగ.. కూల్ డ్రింక్స్‌ను కూడా వదలరా? కల్తీ చేస్తున్న వీడియో వైరల్

Cold Drinks

Cold Drinks : వేసవిలో మండే ఎండల నుంచి సేదతీరేందుకు ఎక్కువ మంది కూల్ డ్రింక్స్ తాగేందుకు ఆసక్తి చూపుతుంటారు. దీంతో వేసవిలో కూల్ డ్రింక్స్ కు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. పలు రకాల బ్రాండ్స్ పేరుతో మార్కెట్ లో కూల్ డ్రింక్స్ అందుబాటులో ఉంటున్నాయి. ఇదే అదునుగా భావిస్తున్న కొందరు వ్యక్తులు నకిలీ కూల్ డ్రింక్స్ తయారు చేసి వాటిపై కంపెనీ లేబుల్స్ అంటించి విక్రయాలు చేస్తున్నారు. పలు పాన్ షాపులు, పట్టణాలు, పల్లెల్లో పలు కిరాణం దుకాణాలను టార్గెట్ చేసుకొని వాటి ద్వారా నకిలీ కూల్ డ్రింక్స్ దందాను కొనసాగిస్తుంటారు. ఇలాంటి దందాపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నా ఎక్కడోచోట నకిలీ కూల్ డ్రింక్స్ తయారీ జరుగుతూనే ఉంది. తాజాగా.. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : ముఖ్తార్ అన్సారీ అంత్యక్రియలకు భారీ ఎత్తున జనం.. ఘాజీపూర్‌లో పటిష్ట భద్రత

నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలో.. కొందరు వ్యక్తులు ఓ కంపెనీకి చెందిన కూల్ డ్రింక్స్ బాటిల్స్ లో నకిలీ డ్రింక్ నింపుతున్నారు. దానికి కంపెనీ లేబుల్ ఉండటం వీడియోలో చూడొచ్చు. వీడియో కనిపిస్తున్న పరిసరాలన్నీ అపరిశుభ్రంగా ఉన్నాయి. సుమారు 20 సెకన్ల పాటు ఈ వీడియో ఉంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియోను 29వ తేదీ ఎక్స్ లో షేర్ చేయగా.. ఒక మిలియన్ మంది నెటిజన్లు వీడియోను వీక్షించారు. కొందరు నెటిజన్లు బాబోయ్.. కూల్ డ్రింక్స్ తాగాలంటేనే భయమేస్తోంది అంటూ రాశారు. ఓ వినియోగదారుడు స్పందిస్తూ.. కంపెనీలు తమ ఉత్పత్తులపై క్యూఆర్ కోడ్ లను కలిగి ఉండాలి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు సంబంధిత వెబ్ సైట్లోకి వెళ్లేలా ఉండాలి. అప్పుడు అసలా లేదా కల్తీనా అని తెలుస్తోందని పేర్కొన్నాడు.

Also Read : Cool Drinks : బాబోయ్.. కూల్ డ్రింక్స్‌లో ప్రాణాంతక వైరస్? భయాందోళనలో జనాలు.. ఇందులో నిజమెంత

ఒకసారి మాకు శ్రీకాళహస్తి సమీపంలోని కూల్ డ్రింక్స్ కంపెనీని సందర్శించే అవకాశం దక్కింది. పూర్తి భిన్నంగా, రుచికరంగా ఉంది. అయితే, బయట ఓ షాపుకెళ్లి అదే కూల్ డ్రింక్ తాగితే రుచిలో తేడా అనిపించింది. అది నకిలీ కూల్ డ్రింక్. అంటూ ఓ వినియోగదారుడు రాశాడు. ఇలా.. నెటిజన్లు ఈ వీడియోపై తమ స్పందన తెలియజేస్తున్నారు.