కుక్కపిల్లను దత్తత తీసుకున్న కోతి: చూసి నేర్చుకోండి

  • Published By: veegamteam ,Published On : December 5, 2019 / 04:43 AM IST
కుక్కపిల్లను దత్తత తీసుకున్న కోతి: చూసి నేర్చుకోండి

Updated On : December 5, 2019 / 4:43 AM IST

ఆ ఆడ కోతి చిన్న కుక్కపిల్లను దత్తత తీసుకుంది. ఈ అరుదైన..అద్భుతమైన ఘటన ఉత్తరాఖండ్ లోని హరిద్వారలో చోటుచేసుకుంది. నవజాత కుక్కపిల్లను దత్తత తీసుకున్న ఈ కోతి దాన్ని ఎంతో ప్రేమగా..ఆప్యాయంగా కంటికి రెప్పలా చూసుకుంటోంది. 

ఇదేంటీ కోతి కుక్కపిల్లను దత్తత తీసుకోవటం ఏంటీ అనే ఆశ్యర్యంతో కూడిన ఆసక్తి..కలుగుతుంది. ఓ ఆడ కోతి అనాథలా పడి ఉన్న కుక్కపిల్లను చూసింది. అప్పటి నుంచి దాన్ని తనకూడానే తిప్పుకుంటూ దాని ఆలనా పాలనా చూస్తోంది. తినటానికి ఆహారం పెడుతోంది. ఆ కోతి ఎక్కడికి వెళితే అక్కడికి ఆ కుక్కపిల్లను తీసుకెళుతోంది. దానికి దొరికిన ఆహారాన్ని కుక్కపిల్లకు పెడుతోంది. ఆ కుక్కపిల్ల కూడా కోతిని విడిచిపెట్టకుండా తిరుగుతోంది. 

హరిద్వార్ గాయత్రి విహార్ కాలనీలో కుక్క కోతిల అనుబంధాన్ని గమనిస్తున్న  ఓ మహిళ జాతి బేధం మరచి..కుక్కపిల్లను ఆదరంగా అక్కున చేర్చుకున్న  ఆ కోతికి కుక్కపిల్లకు పాలు ఆహారం పెడుతోంది. వాటికి పక్క వేసి వసతి కూడా ఏర్పాటు చేసింది. కానీ ఇలా ఎంతకాలం ఆ కుక్కపిల్లను ఆ కోతిని దగ్గర ఉంచుకోగలదు అది సాధ్యమేనా అని అనుకున్నదో ఏమో ఆమె  బుధవారం (డిసెంబర్ 4)న అటవీశాఖవారికి సమాచారం అందించింది. 

వెంటనే వచ్చిన అటవీ శాఖ సిబ్బంది ఆ కోతిని తీసుకెళ్లిపోయారు. ఆ కుక్కపిల్లను మేము పెంచుకుంటామని ఆమె భరోసా ఇచ్చింది. ఈ అరుదైన ఘటనపై హరిద్వార్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డిఎఫ్ఓ) ఆకాష్ కుమార్ వర్మ మాట్లాడుతూ కోతిని అడవుల్లో విడిచిపెడతామని తెలిపారు. కుక్క పిల్లను సదరు మహిళ పెంచుకుంటామని తెలిపిందని చెప్పారు.

మనుషుల్లో మానవత్వం కనుమరుగైపోతున్న ఈ రోజుల్లో జంతువులు మాత్రం జాతి బేధాన్ని మరిచి ఉండటం చాలా చాలా సంతోషించాల్సిన విషయం. సభ్యసమాజంలో ఉండే మనుషులు అనాగరికంగా ప్రవర్తిస్తున్న ఈ కాలంలో జంతువులను చూసి మనుషులు నేర్చుకోవాల్సింది చాలానే ఉందని కోతి నిరూపించింది.