‘నేను కళ్లుతెరిచి చూసేసరికి చుట్టూ మృతదేహాలే’.. విమాన ప్రమాదం తరువాత భయానక పరిస్థితుల గురించి వివరించిన విశ్వాస్ కుమార్

విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన వ్యక్తి పేరు విశ్వాస్ కుమార్ రమేష్. అతనికి 40ఏళ్లు. విమానంలోని 11ఎ సీటులో కూర్చొన్న అతను..

‘నేను కళ్లుతెరిచి చూసేసరికి చుట్టూ మృతదేహాలే’.. విమాన ప్రమాదం తరువాత భయానక పరిస్థితుల గురించి వివరించిన విశ్వాస్ కుమార్

Vishwas Kumar Ramesh

Updated On : June 13, 2025 / 8:33 AM IST

Ahmedabad Plane Crash: గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం గురువారం కుప్పకూలి మంటల్లో దగ్దమైన విషయం తెలిసిందే. ఈ ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ఉన్నారు. వీరిలో 229 మంది ప్రయాణికులు, 12మంది విమాన సిబ్బంది మరణించారు. ఒక్కరు మాత్రమే మృత్యువు నుంచి బయటపడ్డాడు. ఈ విమానం వైద్య కళాశాల సముదాయంపై పడటంతో అందులోని 24మందిసైతం మరణించారు.

Also Read: Amit Shah: వెయ్యి మందికి డీఎన్ఏ పరీక్షలు, ఆ తర్వాతే..- విమాన ప్రమాదంలో మృతుల సంఖ్యపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన వ్యక్తి పేరు విశ్వాస్ కుమార్ రమేష్. అతనికి 40ఏళ్లు. విమానంలోని 11ఎ సీటులో కూర్చొన్న విశ్వాస్.. అనూహ్యరీతిలో ప్రాణాలతో బయటపడ్డాడు. విశ్వాస్ బ్రిటన్ పౌరుడు. అతడు 20ఏళ్లుగా లండన్ లో నివసిస్తున్నాడు. తని భార్య, పిల్లలు కూడా లండన్ లోనే నివసిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం గుజరాత్‌లో ఉన్న తన కుటుంబాన్ని కలిసేందుకు బ్రిటన్ నుంచి విశ్వాస్ వచ్చాడు. తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

హిందూస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఘోర విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన విశ్వాస్ కుమార్ రమేష్ ప్రమాదం జరిగిన సమయంలో ఏం జరిగిందనే విషయాన్ని వెల్లడించారు. ‘‘టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పెద్ద శబ్దం వచ్చింది. విమానం కూలిపోయింది. ఇదంతా చాలా త్వరగా జరిగింది. ప్రమాదం తరువాత నేను మేల్కొన్నప్పుడు నా చుట్టూ మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. నేను భయపడి అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయాను. విమానం ముక్కలు నా చుట్టూ చెల్లాచెదురుగా ఉన్నాయి. ఆ సమయంలో ఎవరో నన్ను పట్టుకొని అంబులెన్సులో ఎక్కించి ఆసుపత్రికి తీసుకెళ్లారు.’’ అని విశ్వాస్ చెప్పారు.

విశ్వాస్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. స్థానిక ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. విశ్వాస్ సోదరుడు కూడా ఈ విమానంలో ఉన్నప్పటికీ ఆయన ఆచూకీ తెలియరాలేదు. కాగా ప్రమాదంపై దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది.