చిన్నమ్మకు కోర్టులో చుక్కెదురు.. శిక్ష పూర్తయ్యేవరకు జైలులోనే!

  • Published By: vamsi ,Published On : December 5, 2020 / 05:20 PM IST
చిన్నమ్మకు కోర్టులో చుక్కెదురు.. శిక్ష పూర్తయ్యేవరకు జైలులోనే!

Updated On : December 5, 2020 / 5:33 PM IST

అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి అమ్మ జయలలిత సన్నిహితురాలు చిన్నమ్మ అని పిలిచే శశికళకు ఎదురుదెబ్బ తగిలింది. తనను జైలు నుంచి ముందస్తుగా విడుదల చేయాలంటూ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దీంతో ఆమె నాలుగేళ్ల శిక్షాకాలం పూర్తి చేసుకుని 2021 జనవరి చివరిలో మాత్రమే విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సహాయకురాలు శశికళ నటరాజన్.. ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించగా.. చిన్నమ్మగా ఆమెను వ్యవహరిస్తూ ఉంటారు.


మంచి ప్రవర్తన కారణంగా ముందుగా తనను విడుదల చెయ్యాలంటూ.. ఆమె దరఖాస్తు చేసుకోగా.. కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. ముందస్తు విడుదలకు కోర్టు అంగీకరిస్తుందనే ఆశతో.. రూ.10 కోట్ల జరిమానాను చిన్నమ్మ వర్గీయులు కోర్టుకు డిపాజిట్‌ చేసినట్లు తెలుస్తుంది. అయితే కోర్టులో ఆమెకు సానుకూల తీర్పు రాలేదు. కోర్టులో రూ.10కోట్ల రూపాయలు డీడీ రూపంలో చెల్లింపులు జ‌ర‌గ‌డంతో.. శ‌శిక‌ళ అతి త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంద‌ని వార్తలు వచ్చాయి. అయితే అలా కుదరలేదు.



శశికళ విడుదల అవుతుందని వస్తున్న వార్తల నేపధ్యంలో కర్ణాటక హోంమంత్రి బసవరాజ్‌ మాట్లాడుతూ.. అవినీతి నిరోధక చట్టం కింద శిక్షకు గురైనవారు కోర్టు తీర్పు ప్రకారం పూర్తికాలం జైలు జీవితాన్ని అనుభవించాల్సి ఉంటుందని అన్నారు. ఈ నేరాలకు సత్ప్రవర్తన వర్తించదని మంత్రి బసవరాజ్ అన్నారు. ఈ ప్రకారం శశికళ నాలుగేళ్లు పూర్తిగా జైలు జీవితం గడపాలని స్పష్టం చేశారు.



ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.10 కోట్ల జరిమానా విధించిన తర్వాత శశికళ 2017 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో కాలం గడుపుతున్నారు. ఇదే నేరంపై ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్‌ సైతం అదే జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. కోర్టు తీర్పు ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండోవారంలో ఆమె నాలుగేళ్ల శిక్షాకాలం ముగుస్తుంది.