Corona Lockdown: 10నెలల శిశువును ఎత్తుకుని 2రోజులు కాలి నడకన ప్రయాణం

Corona Lockdown: 10నెలల శిశువును ఎత్తుకుని 2రోజులు కాలి నడకన ప్రయాణం

Updated On : March 26, 2020 / 6:30 AM IST

కొడుకుకు నడక నేర్పాల్సిన వయస్సులో ఆ తండ్రి ఇంటికి చేరుకోవడానికి కాలి నడకే గతైంది. లాక్ డౌన్ సమయంలో ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ లో ఉన్న తన ఇంటికి కాలినడకనే ప్రయాణమైయ్యాడు. దేశవ్యాప్తంగా 21రోజుల పాటు లాక్ డౌన్ లోకి వెళ్లిపోవాలని ప్రకటించిన తర్వాత ఆ కుటుంబానికి వేరే ఆప్షన్ లేకుండాపోయింది. ‘ఇక్కడే ఉండి మేం ఏం తినాలి. రాళ్లు తిని బతకలేం కదా’ అని అతని భార్య నెత్తిన సంచి పెట్టుకుని ఆవేదన వ్యక్తం చేస్తుంది. 

బంటీ అనే వ్యక్తి భుజాలపై చిన్నారిని ఎక్కించుకుని చేత్తో కూతురి వేలు పట్టుకుని నడిపించుకుంటూ ఇంటి దారి పట్టాడు. ‘ఢిల్లీలో ఉంటే మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇంటికి ఎలా వెళ్లాలో అర్థం కాలేదు. మాకు రోటీ, పచ్చడి దొరికినా ప్రశాంతంగా అక్కడే ఉండే వాళ్లం. కానీ, మా దగ్గరేం లేవు. ఢిల్లీలో ఉంటే ఎవరూ సాయం చేయరు’ అంటున్నాడు బంటీ. 

ఢిల్లీకి 150కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరికి చేరుకోవడానికి బంటీకి ముగ్గురు పిల్లలతో 2రోజుల సమయం పడుతుంది. వారికి తగిన డబ్బు లేదు.. అంతే స్థాయిలో ఆహారం కూడా అందుబాటులో లేదు. లాక్ డౌన్ సమయంలో బస్సులు, రైళ్లు పనిచేయకపోవడం వారికి సహాయం దొరక్కుండా చేశాయి. సరిహద్దులను, పోలీసులను దాటుకుని వెళ్లేందుకు రెడీ అయిపోయారట. 

మోడీ 21రోజులు లాక్ డౌన్ ప్రకటించగానే సుదీర్ఘ సమయం తిండి లేకుండా ఎలా ఉండాలని చాలా మందిలో మెదిలిన ప్రశ్న.. ప్రతి ఒక్కరూ ఇళ్లలో ఉంటే కరోనాను కట్టడి చేయొచ్చని ప్రభుత్వం ఆలోచన. కానీ, బంటి కుటుంబానికి ఇది పెద్ద సమస్య. ముందు చావు.. వెనుక దెయ్యంతో పోరాడుతూ.. చేేది లేక అలీఘర్ కు రెండ్రోజుల్లో చేరుకోవాలని ప్రయాణమైయ్యారు. 

ఈ లాక్ డౌన్ ప్రకటించే సమయంలో పేదవారికి సాయం చేయాలని మోడీ పదేపదే చెప్పారు. వారణాసిలో నియోజకవర్గ సభ్యులతో మాట్లాడేటప్పుడు సామర్థ్యం ఉన్న వారు ఓ 9కుటుంబాలు చొప్పున సాయం చేయాలని ప్రతిజ్ఞ చేయించారు.  బీజేపీకి ఉన్న కోటి మంది వర్కర్లను ఒకొక్కరినీ ఐదుగురికి సాయం చేయాలని కోరారు. ఫలితంగా ఓ ఐదు కోట్ల మందికి సాయం చేయొచ్చని పార్టీ చీఫ్ నడ్డా యొక్క ముఖ్య సారాంశం. 

Also Read | కరోనాపై పోరాటం: దర్శకుడు త్రివిక్రమ్ సాయం