ఆందోళనలు బెంగాల్ వైపు మళ్లిస్తాం…కేంద్రానికి టికాయిత్ హెచ్చరిక

Rakesh Tikait నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంతవరకు ఢిల్లీ సరిహద్దులను దాటి వెళ్లేది లేదని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయిత్ స్పష్టం చేశారు. హరియాణాలో నిర్వహించిన కిసాన్ మహాపంచాయత్‌లో పాల్గొన్నటికాయిత్.. రైతులు తమ పొలాలను చూసుకునేందుకు వెళ్లిపోతారని.. దీంతో రైతు ఉద్యమం ముగిసిపోతుందనే భ్రమలో కేంద్రం ఉండొద్దని హెచ్చరించారు.
రైతులుగా వ్యవసాయమూ చేస్తాం..ఆందోళనలూ కొనసాగిస్తాం అని టికాయిత్ అన్నారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటను సైతం తగలబెట్టడానికైనా రైతులు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. రాబోయే రోజుల్లో గుజరాత్,బెంగాల్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సైతం కిసాన్ మహాపంచాయత్ నిర్వహించనున్నట్టు తెలిపారు.
రైతు సంఘాలు తదుపరి పోరాటానికి పిలుపునిచ్చే ఆందోళనల్లో పాల్గొనేందుకు అన్నదాతలు సమాయత్తం కావాలని టికాయిత్ సూచించారు. ఏ సమయంలోనైనా పిలుపు రావొచ్చని..ఢిల్లీకి ప్రయాణించడానికి ట్రాక్టర్లలో ఇంధనాన్ని నింపి సిద్ధంగా ఉండాలన్నారు.
ప్రభుత్వం దిగి రాకుంటే ట్రాక్టర్లలో రైతులు.. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న బెంగాల్ వైపు మళ్లి ఆందోళనలు చేస్తారని టికాయిత్ వెల్లడించారు. బెంగాల్ లో కూడా రైతులు ఇక్కట్లలో ఉన్నారని, వారి తరపున పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.