రాజకీయాలకు మేం దూరం…బిపిన్ రావత్

సాయుధ దళాలు రాజకీయాలకు దూరంగా ఉంటాయని తొలి త్రివిధ దళాధిపతి(సీడీఎస్) బిపిన్ రావత్ అన్నారు. తాము రాజకీయాలకు చాలా దూరంగా ఉంటామని, అధికారంలో ఉన్న ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ పనిచేస్తామని బుధవారం(జనవరి-1,2020)బిపిన్ రావత్ స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలను ఉద్దేశించి ఇటీవల బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే.
ఆర్మీకి రాజకీయ రంగు పలుముకుందని ఆరోపణలు వచ్చాయి. రావత్ వ్యాఖ్యలను వివిధ పార్టీలకు చెందిన రాజకీయనాయకులతో పాటు సామాన్యులు కూడా ఖండించారు. తన వాఖ్యలు వివాదాస్పదమైన సమయంలో తాము రాజకీయాలకు ఎంతో దూరంగా ఉంటాం, అధికారంలో ఉన్న ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ పనిచేస్తుంటామని రావత్ బుధవారం సృష్టం చేశారు.
‘‘ప్రజలను తప్పుదోవ పట్టించేవారు ఎప్పటికి నాయకులు కాలేరు’’ అని పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనల గురించి రావత్ గత గురువారం ఢిల్లీలో వ్యాఖ్యానించారు. ‘‘మన నగరాల్లో, పట్టణాల్లో ప్రజలు విధ్వంసకాండకు పాల్పడేలా కళాశాలలు, యూనివర్శిటీల విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. అది ఎప్పటికీ నాయకత్వం అనిపించుకోదు’’ అని రావత్ వ్యాఖ్యానించారు. రావత్ వ్యాఖ్యలు ఆర్మీ యాక్ట్ సెక్షన్ 21 ను ఉల్లంఘించడమేనని సీపీఐ నేతలు ఆరోపించారు. రావత్ వ్యాఖ్యలను వివిధ పార్టీలకు చెందిన రాజకీయనాయకులతో పాటు సామాన్యులు కూడా ఖండించారు.