Gautam Adani: అదానీపై అమెరికాలో కేసు నమోదుకు కారణం ఏమిటి.. అదానీ గ్రూప్ స్పందన ఏమిటంటే?
భారత్ లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకునేందుకు భారత ప్రభుత్వ అధికారులకు రూ. 2,029 కోట్లు ($265 మిలియన్లు) లంచం ఇచ్చారని ఆరోపిస్తూ అదానీ గ్రూప్ చైర్ పర్సన్ గౌతమ్ అదానీ ..

Gautam Adani
Gautam Adani bribery case : భారత్ లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకునేందుకు భారత ప్రభుత్వ అధికారులకు రూ. 2,029 కోట్లు ($265 మిలియన్లు) లంచం ఇచ్చారని ఆరోపిస్తూ అదానీ గ్రూప్ చైర్ పర్సన్ గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీ సహా మరో ఆరుగురిపై యూఎస్ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపడంతో గౌతమ్ అదానీకి ఇబ్బందులు తలెత్తాయి. 2020 నుంచి 2024 మధ్య కాలంలో లంచాలు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదే సమయంలో బ్యాంకులు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులను సమీకరించేందుకు యత్నించినట్లు ప్రధాన ఆరోపణలుగా ఉన్నాయి. ఈ ఆరోపణల్లో అమెరికా ఇన్వెస్టర్ల నిధులు కూటా ఉండటంతో ఆ దేశం దర్యాప్తు ప్రారంభించింది.
Also Read: అదానీని అరెస్ట్ చేయరు.. ఆయనపై విచారణ జరగదు.. ఎందుకో చెప్పిన రాహుల్ గాంధీ
ముఖ్యంగా రెండు అంశాలపై ఆరోపణలు ఉన్నాయి. రెండు బిలియన్ డాలర్ల విలువైన రెండు సిండికేట్ రుణాలకు సంబంధించిన అంశం వీటిల్లో ఒకటి కాగా.. అంతర్జాతీయ ఫైనాన్సియల్ సంస్థలు ఇచ్చిన భరోసాను చూపి అమెరికా, ఇతర ప్రదేశాల్లోని ఇన్వెస్టర్లకు ఆఫర్ చేసిన ఒక బిలియన్ డాలర్ల విలువైన బాండ్లకు సంబంధించినది రెండో ఆరోపణ. యూఎస్ నేరారోపణ ప్రకారం.. గౌతమ్ అదానీ, అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సాగర్ అదానీ, అజూర్ పవర్ సీఈవో రంజిత్ గుప్తా, అజూర్ పవర్ లో కన్సల్టెంట్, సీఈవో రూపేష్ అగర్వాల్ యూఎస్ జారీదారు కోసం పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో అమెరికాలోని ఫారెన్ కరెప్ట్ ప్రాక్టిసెస్ యాక్ట్ (ఎఫ్సీఏసీ) ఉల్లంఘన జరిగినట్లు అక్కడి ఏజెన్సీలు చెబుతున్నాయి. అమెరికా కంపెనీలు, వ్యక్తులు విదేశాల్లో అవినీతి పనుల్లో భాగం కాకుండా చూడటమే దీని లక్ష్యం. దీని ఉల్లంఘన అక్కడ తీవ్రమైన నేరం కింద పరిగణిస్తారు.
అమెరికా ప్రాసిక్యూటర్లు చేసిన నేరారోపణల ప్రకారం.. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) కు 12 గిగావాట్ల విద్యుత్ సరఫరా చేసేందుకు భారత కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంటే, రాష్ట్రాల విద్యుత్ పంపిణీ కంపెనీలతో ఎస్ఈసీఐ ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంలోకి వచ్చింది. అయితే, విద్యుత్ సరఫరా ఖర్చుతో కూడుకున్న పని కాబ్టటి రాష్ట్రాల కంపెనీలు కొనుగోలుకు ఆసక్తి చూపలేదు. దీంతో అదానీ గ్రూప్ 2021 జులై నుంచి 2022 ఫిబ్రవరి మధ్య ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు 265 మిలియన్ డాలర్లు ఇవ్వజూపినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తమపై వచ్చిన ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందించింది. సోలార్ పవర్ కాంట్రాక్టులు దక్కించుకోవడానికి లంచం ఇవ్వజూపారంటూ వచ్చిన అభియోగాలను తోసిపుచ్చింది. అదానీ త్రూపు పై అమెరికా ప్రాసిక్యూటర్లు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని, చట్టాలకు లోబడి తమ గ్రూపు నడుచుకుంటోందని వివరణ ఇచ్చింది. న్యాయపరంగా ముందుకెళ్తామని అదానీ గ్రూప్ పేర్కొంది.