అదానీని అరెస్ట్ చేయరు.. ఆయనపై విచారణ జరగదు.. ఎందుకో చెప్పిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తో కలిసి రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.

Rahul Gandhi
Rahul Gandhi : భారత బిలియనీర్, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. అధికారులకు లంచం ఇచ్చినట్లు ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదైనట్లు తెలిసింది. అయితే, ఆ ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందించింది. సోలార్ పవర్ కాంట్రాక్టులు దక్కించుకోవడానికి లంచం ఇవ్వజూపారంటూ వచ్చిన అభియోగాలను అదానీ గ్రూప్ తోసిపుచ్చింది. తమపై అమెరికా ప్రాసిక్యూటర్లు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని కొట్టి పారేసింది అదానీ గ్రూప్. అయితే, తాజాగా ఈ విషయంపై కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. అదానీని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: Gautam Adani: ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు.. ఎందుకంటే?
కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తో కలిసి రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. అమెరికా, భారత చట్టాలను అదానీ ఉల్లంఘించారనే విషయంపై ఇప్పుడు స్పష్టత వచ్చిందని, వెంటనే ఆయన్ను అరెస్టు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాజా ఆరోపణలపై తక్షణమే జేపీసీతో విచారణ జరిపించాలన్న రాహుల్.. శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని చెప్పారు. అదానీని వెంటనే అరెస్టు చేసి విచారణ జరిపితే అన్ని విషయాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అదానీ అరెస్టు కాడని, ఆయనపై విచారణ జరగదని నేను గ్యారంటీ ఇస్తానని.. అందుకు కారణం ప్రధాని నరేంద్ర మోదీనే అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. అదానీ అరెస్టు కాకుండా, ఆయనపై విచారణ జరగకుండా ప్రధాని మోదీ కాపాడుతున్నాడని, మోదీ, అదానీల బంధం భారత్ లో ఉన్నంత వరకే సురక్షితమని అన్నారు. తన అవినీతి ద్వారా దేశ ఆస్తులన్నీ అదానీ దోచుకుంటున్నాడంటూ రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.