నవంబర్ 4లోగా ఫేస్‌బుక్ వివరణ ఇవ్వాలి : వాట్సాప్ స్పైవేర్ దాడిపై ప్రభుత్వం సీరియస్

వాట్సాప్‌పై స్పైవేర్ ఎటాక్.. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ యూజర్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇజ్రాయెల్ కు చెందిన టెక్ కంపెనీ కొంతమంది హైప్రొఫైల్ యూజర్లను ఎంపిక చేసి వారి అకౌంట్లను హ్యాకింగ్ చేసినట్టు వాట్సాప్ ట్రేస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 20దేశాల్లోని హైప్రొఫైల్ వాట్సాప్ యూజర్లే లక్ష్యంగా స్పైవేర్ దాడి జరిగినట్టు వాట్సాప్ అంతర్గత విచారలో గుర్తించింది. వీరిలో ఇండియాకు చెందిన జర్నలిస్టులు, సామాజికవేత్తలతో పాటు హైప్రొఫైల్ ప్రభుత్వ అధికారుల వాట్సాప్ అకౌంట్లు ఉన్నట్టు మెసేజింగ్ యాప్ గుర్తించింది.
వాట్సాప్ స్పైవేర్ దాడిపై భారతీయ ప్రభుత్వం స్పందించింది. ఇండియాలో వాట్సాప్ యూజర్ల అకౌంట్ల హ్యాకింగ్ డేటాకు సంబంధించి ఐటీ మంత్రిత్వ శాఖ ఆరా తీసింది. నవంబర్ 4లోగా ఫేస్ బుక్ సొంత మెసేజింగ్ ప్లాట్ ఫాం వాట్సాప్ స్పందించాలని, వెంటనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం కోరింది.
ఇజ్రాయెల్ NSO గ్రూపు Pegasus అనే స్పైవేర్ టూల్ సాయంతో 1,400 మంది వాట్సాప్ యూజర్లను లక్ష్యంగా చేసుకుని వారి అకౌంట్లను హ్యాక్ చేసినట్టు కంపెనీ ఆరోపించింది. ఇందులో భారతీయ వాట్సాప్ యూజర్లు కూడా ఉన్నట్టు మెసేజింగ్ సంస్థ వెల్లడించింది. డేటా ఉల్లంఘన కింద యూఎస్ ఫెడరల్ కోర్టులో NSO గ్రూపుపై వాట్సాప్ దావా వేసింది.
స్పైవేర్ టూల్ ద్వారా యూజర్ల మొబైల్ ఫోన్లకు మిస్స్ డ్ కాల్స్ ఇచ్చి బాధితులను టార్గెట్ చేసినట్టు వాట్సాప్ ఆరోపించింది. ఇండియాలో స్పైవేర్ తో ప్రభావితమైన బాధిత యూజర్లను ఒక్కొక్కరిని వాట్సాప్ సంప్రదించి వారిని అప్రమత్తం చేసింది. అందులో ఎకడామిక్స్, లాయర్లు, సామాజికవేత్తలు, జర్నలిస్టులు ఉన్నట్టు వాట్సాప్ తెలిపింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో వెంటనే సైబర్ సెక్యూరిటీ నిపుణులు సిటిజన్ ల్యాబ్ అలర్ట్ అయింది. ఇప్పటివరకూ ఎంతమంది యూజర్ల అకౌంట్లు ప్రభావితమయ్యేదానిపై నిశితంగా పరిశీలించాయి.