ఆందోళనల మాటున రైతుల అసలు ప్రయోజనాలు మరుగునపడుతున్నాయా..?

పంటలకు కనీస మద్దతు ధర చట్టబద్ధత దక్షిణ భారతదేశం రైతులకు అవసరం లేదా..? ప్రతిసారీ ఉద్యమాలు పంజాబ్ రైతులే ఎందుకు చేస్తున్నారు..?

ఆందోళనల మాటున రైతుల అసలు ప్రయోజనాలు మరుగునపడుతున్నాయా..?

Why South Indian Farmers are not protesting like North Indian Farmers Explained here

Farmers Protest: అన్నదాతల ఆందోళన కొనసాగుతోంది. ఢిల్లీ చలో పేరుతో దేశరాజధానికి చేరాలనుకున్న రైతులకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. హస్తిన చేరలేని అన్నదాతలు హర్యానా సరిహద్దుల్లోనే నిరసన శిబిరాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ నెల 29వరకు ఉద్యమానికి తాత్కాలిక విరామం ప్రకటించిన రైతులు భవిష్యత్ కార్యాచరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నదే రైతుల ఆందోళన ప్రధాన డిమాండ్ అయినప్పటికీ.. సువిశాల భారతదేశంలో సాటి రైతుల నుంచే వారికి కావాల్సినంత మద్దతు లభించని పరిస్థితులు నెలకొనడం ప్రస్తుత ఉద్యమంలోని మరో కోణం.

హామీలను నెరవేర్చకపోవడం వల్లే..
2020-21లో రైతులు చేసిన ఉద్యమం ఫలితంగా కేంద్రం వివాదాస్పద వ్యవసాయ చట్టాలు రద్దుచేసింది. ఆ సమయంలో కొన్ని హామీలిచ్చింది. ఆ హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకపోవడం వల్లే ఇప్పుడు ఉద్యమం చేయాల్సి వస్తోందన్నది రైతు సంఘాలు చెబుతున్న మాట. అయితే గతంలోలా పంజాబ్ నుంచి హర్యానా మీదగా ఢిల్లీ చేరినంత తేలిగ్గా రైతులిప్పుడు దేశరాజధానికి చేరుకోలేకపోతున్నారు. భారీ ఎత్తున మోహరించిన కేంద్రబలగాలు, రాష్ట్రాల పోలీసులు, ఇనుపకంచెలు, బారికేడ్లు, పెద్ద పెద్ద సిమెంట్ దిమ్మెలతో అడుగడుగునా రైతులకు ఆటంకాలు కల్పిస్తోంది కేంద్రం. దీంతో 15 రోజల క్రితం పంజాబ్ నుంచి బయలుదేరిన రైతులు హర్యానా సరిహద్దుల్లోనే ఆగిపోవాల్సివచ్చింది. శంభు, ఖనౌరీ సరిహద్దులే ఇప్పుడు రైతుల ఉద్యమానికి వేదికయ్యాయి. అక్కడే రైతులపై లాఠీచార్జ్‌లు, భాష్పవాయుగోళాల ప్రయోగాలు, కాల్పులు జరుగుతున్నాయి. చర్చల దారి చర్చలదే.. ఉద్యమం దారి ఉద్యమమే అన్న తరహాగా 15 రోజులుగా పరిస్థితులు ఉన్నాయి. ఈ నెల 21న శంభు, ఖనౌరీలో రైతుల ఆందోళన హింసాత్మకంగా మారడం, ఓ రైతు చనిపోవడంతో ఉద్యమానికి తాత్కాలికంగా విరామం ప్రకటించారు రైతులు. శంభు సరిహద్దుల్లోనే ఆగిపోయి నిరసన శిబిరాలు ఏర్పాటుచేసుకుని రోజుకోరీతిలో ప్రభుత్వంపై ఆగ్రహం చూపిస్తున్నారు. క్యాండిల్ మార్చ్, దిష్టిబొమ్మల దహనం వంటివాటితో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

వ్యవసాయచట్టాల రద్దు సమయంలో కేంద్రం అప్పుడు ఉద్యమం చేసిన రైతుసంఘాలకు కొన్ని హామీలిచ్చింది. ఆ హామీల్లో వేటిని కూడా కేంద్రం అమలనుచేయడం లేదన్నదే తాజాగా రైతులు చేస్తున్న ఆరోపణ. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, 2013 భూసేకరణ చట్టం అమలు, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ, వ్యవసాయంతో ఉపాధి హామీ చట్టం అనుసంధానం, రోజుకు 700 రూపాయలు చొప్పున ఏడాదికి 200 రోజులు ఉపాధి హామీ అమలు, రైతులు, రైతు కూలీలకు పూర్తిగా రుణమాఫీ, లఖింపూర్ ఖేరీ బాధ్యులకు కఠిన శిక్షలు, రైతులు, కార్మికులకు వృద్ధాప్య పింఛన్, గత ఉద్యమం సమయంలో అమరులైన వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వంటి అనేక హామీలు అమలుచేయాలని రైతులు డిమాండ్‌లు చేస్తున్నారు. ఉద్యమం ప్రారంభం కాకముందునుంచీ, ఇప్పటివరకు రైతులతో కేంద్రం జరిపిన చర్చలేవీ ఫలించలేదు.

ఉక్కుపాదంతో అణిచివేసే ప్రయత్నం
మరోవైపు ఎన్నికల సమయమనో.. గత ఉద్యమం సమయంలో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకునో తెలియదు కానీ.. ప్రస్తుత ఉద్యమాన్ని కేంద్రం తేలిగ్గా తీసుకోవడం లేదు. ఓ రకంగా చెప్పాలంటే.. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేసేందుకు ప్రయత్నిస్తోంది. అసలు రైతులను ఢిల్లీలో అడుగుపెట్టనివ్వకూడదన్నది ప్రభుత్వ ఉద్దేశంలా కనిపిస్తోంది. అందుకే ఈ సారి ఉద్యమమంతా శంభు సరిహద్దుల్లోనే సాగుతోన్న అభిప్రాయం కలుగుతోంది. పంజాబ్ నుంచి బయలుదేరిన రైతులు హర్యానా దగ్గరకు చేరుకున్నప్పటినుంచే ఉద్యమంలో హింస మొదలైపోయింది. మొదటి రోజే భాష్పవాయుగోళాలు ప్రయోగించడానికి కారణం నయానో.. భయానో రైతులను లొంగదీసుకోవాలన్న ఆలోచనే. అడుగడుగునా బారికేడ్లు, ఇనుపకంచెలు, రోడ్లపై ఇనుప మేకులు, సిమెంట్ దిమ్మెలు, భారీ వాహనాలు.. ఎక్కడ చూసినా కేంద్ర బలగాల మొహరింపుతో అసలది పంజాబ్-హర్యానా సరిహద్దా లేక.. భారత్, పాకిస్థాన్ బోర్డరా అన్న సందేహాలు కలిగాయి.

కేంద్రం వ్యవహరశైలిపై తీవ్ర విమర్శలు
గతంలో ఈ స్థాయిలో కేంద్రం కఠినంగా వ్యవహరించలేదు. రైతులను అడ్డుకోవడానికి బలగాలు ప్రయత్నించినప్పటికీ.. నాడు పెద్దసంఖ్యలో అన్నదాతలు ఢిల్లీ చేరుకున్నారు. రిపబ్లిక్ డే రోజు ట్రాక్టర్ పరేడ్ జరిపారు. ఎర్రకోటపై జెండా ఎగరేశారు. ఏడాదిపాటు ఢిల్లీలోనే ఉండి వ్యవసాయచట్టాలు రద్దుచేయాలన్న డిమాండ్ నెరవేర్చుకున్నాకే ఇంటిముఖం పట్టారు. కానీ ఇప్పుడు అన్నదాతలు సరిహద్దులను దాటేందుకే తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. హర్యానా సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాల విషయంలో కేంద్రంపై తీవ్ర విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంత భారీ స్థాయిలో బారికేడ్లను ఏర్పాటుచేయడం, రైతుల చూపుపై తీవ్ర ప్రభావం చూసే టియర్‌గ్యాస్‌ను డ్రోన్ల ద్వారా ప్రయోగించడంవంటివి.. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపించే ప్రమాదముందున్న అభిప్రాయం వినిపిస్తోంది.

రైతు ఉద్యమంలో 200లకు పైగా సంస్థలు
2020-21 ఉద్యమంలో ఏడాది కాలంలో 12 సార్లు రైతు సంఘాలతో కేంద్రం సమావేశాలు జరిపింది. తొలి నాలుగు విడతల చర్చలు వేగంగా జరిగినప్పటికీ తర్వాతి కాలంలో చర్చలకు చాలా సమయం పట్టింది. అయినా రైతులు వెనక్కి తగ్గలేదు. ఎండనక, వాననక, ఢిల్లీలో మైనస్ డిగ్రీల చలిని లెక్కచేయక.. ఎన్నో కష్టనష్టాలకు, వ్యయప్రయాసలకోర్చి శిబిరాల్లోనే నిరసనలు కొనసాగించారు. రైతులను వెనక్కి తిప్పి పంపడానికి వ్యవసాయ చట్టాలను రద్దుచేయడం మినహా మరో దారి కేంద్రానికి లేకుండా పోయిన పరిస్థితి అది. ఈ సారి అలాంటి పరిస్థితులు తెచ్చుకోకూడదన్నది.. అన్ని వ్యవహారాలను తమ నియంత్రణలో ఉంచుకోవాలన్నది కేంద్రం ఉద్దేశంగా కనిపిస్తోంది. మరో వైపు గత ఉద్యమానికి, ఇప్పటికీ.. రైతు సంఘాల్లో కూడా మార్పులొచ్చాయి. ప్రస్తుతం ఢిల్లీ చలో ఉద్యమానికి యునైటెడ్ కిసాన్ మోర్చా(రాజకీయేతర విభాగం), కిసాన్ మజ్దూర్ మోర్చా నాయకత్వం వహిస్తున్నాయి. 200లకు పైగా సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. అయితే గతంలో ఉద్యమానికి నేతృత్వం వహించిన నాయకులు ఇప్పుడు కనిపించడం లేదు. రాకేశ్ టికాయత్ వంటివారు ఉద్యమ నాయకత్వ స్థానంలో లేరు. భారతీయ కిసాన్ యూనియన్, రివల్యూషనరీ కిసాన్ యూనియన్ వంటి సంస్థల భాగస్వామ్యం ఇప్పుడు కనిపించడం లేదు.

ప్రస్తుతం ఉద్యమానికి కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నాయకుడు స్వరణ్ సింగ్ పాంధర్ నేతృత్వం వహిస్తున్నారు. జగ్జీత్‌సింగ్ దల్లేవాల్, భారత కిసాన్ యూనియన్‌ రివల్యూషనరీకి చెందిన సుర్జిత్ సింగ్ పూల్, అభిమన్యు కోహర్, శివకుమార్ కక్కా వంటివారు ప్రస్తుత ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ప్రస్తుత ఉద్యమంలో పనిచేయనప్పటికీ రైతుల డిమాండ్లకు రైతు సంఘాల నేతలందరి మద్దతు పూర్తిస్థాయిలో ఉందని రాకేశ్ టికాయత్ అంటున్నారు. అయితే డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలన్నీ ఐక్యంగా పనిచేయకపోవడం వెనక కేంద్రం కుట్రదాగి ఉందని, రైతుసంఘాల్లో కేంద్రం చీలికలు తెచ్చిందనీ పలువురు ఆరోపిస్తున్నారు.

దక్షిణ భారతదేశం రైతులకు అవసరం లేదా..?
పంటలకు కనీస మద్దతు ధర చట్టబద్ధత దక్షిణ భారతదేశం రైతులకు అవసరం లేదా..? ప్రతిసారీ ఉద్యమాలు పంజాబ్ రైతులే ఎందుకు చేస్తున్నారు..? అసలు ఈ ఉద్యమాలతో కనీసం పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులకైనా ఏమన్నా లాభం కలుగుతోందా..? ఛలో ఢిల్లీ, ఢిల్లీ చలో పేరుతో జరుగుతున్న ఆందోళనల మాటున రైతుల అసలు ప్రయోజనాలు మరుగునపడుతున్నాయా..?

ప్రధాన డిమాండ్ అదే..
2020-21లో రైతులు చేసిన ఉద్యమం చరిత్రాత్మకం. రాజకీయపార్టీలతో సంబంధం లేకుండా రైతుసంఘాల నేతృత్వంలో సాగిన ఈ ఉద్యమానికి బుద్ధిజీవులంతా మద్దతిచ్చారు. దేశవ్యాప్తంగా రైతులకు సంఘీభావంగా కార్యక్రమాలు జరిగాయి. ఎప్పుడూ పొలాల్లో, పనుల్లో, రోజువారీ కార్యక్రమాల్లో మునిగితేలే రైతన్నలు ఉద్యమకారుల తరహాలో ఈ స్థాయిలో ఉద్యమం చేస్తారని ఎవరూ ఊహించలేదు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు అన్నదాతలు. అనుకున్నది సాధించారు. అయితే అప్పటితో పోలిస్తే.. మూడోవంతుమంది రైతులే ఉద్యమంలో పాల్గొంటున్నారు. వారంతా ఉద్యమానికి నైతిక మద్దతు తెలుపుతూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ఇక మద్దతు ధర విషయానికొస్తే 23 పంటలకు కనీస మద్దతుధరకు చట్టబద్ధత కల్పించాలన్నది రైతుల ప్రధానమైన డిమాండ్‌గా ఉంది. అయితే.. ఆశించిన స్థాయిలో కాకపోయినా.. పంజాబ్ రైతులు గతంలోలా గోధుమ, వరి పంటలకే పరిమితం కావడం లేదు. పెసలు, కందులు, మొక్కజొన్న, మిల్లెట్లు వంటి రకరకాల పంటలు పండిస్తున్నారు. గత రైతు ఉద్యమం జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా గమనిస్తే.. ఎక్కువభాగం రైతులు తమ ఉత్పత్తులను బహిరంగమార్కెట్‌లోనే అమ్ముకుంటున్నారు. ఈ రేట్లు ప్రభుత్వం కల్పించే కనీస మద్దతు ధరకన్నా తక్కువగా ఉంటున్నాయి.

మొత్తం 23 పంటలపై కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర అమలుచేస్తోంది. అయితే పంజాబ్‌లో వరి, గోధుమలను మాత్రమే ప్రభుత్వ సంస్థలు కనీస మద్దతు ధరకు కొనుగోలుచేస్తున్నాయి. మిగిలిన ఉత్పత్తులన్నీ ప్రయివేట్ వ్యాపారులే కొంటున్నారు. మొక్కజొన్న విషయానికొస్తే.. రైతు ఉద్యమం తర్వాత 2021-22లో కనీస మద్దతు ధర క్వింటాల్‌కు 18వందల70 రూపాయాలుగా ఉంటే రైతులు ప్రయివేట్ వ్యక్తులకు క్వింటాల్ మొక్కజొన్నను 500 రూపాయల నుంచి 18వందల15 మధ్య అమ్ముకున్నారు. 2022-23, 2023-24ల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. సజ్జల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ ఏడాది కనీస మద్దతు ధర క్వింటాల్‌కు 2వేల500గా ఉంటే.. రైతులు 16వందల 50రూపాయలకు ప్రయివేట్ వ్యాపారులకు అమ్ముకున్నారు. పెసలు, కందులు, మినుములను కొనేందుకు ప్రభుత్వం రైతులతో ఈ ఏడాది జరిపిన చర్చలు ఫలించలేదు.

కనీస మద్దతు ధరకు చట్టబద్ధత అసాధ్యమా?
23 పంటలకు కనీస మద్దతు ధర చట్టబద్ధత అసాధ్యమని ప్రయివేట్ వ్యాపారులు అంటున్నారు. మొక్కజొన్న వంటి పంటలను కొనుగోలు చేసి నిల్వచేసే సామర్థ్యం ప్రభుత్వం దగ్గర లేదని, అలాగే ఏ వస్తువైనా పంట నాణ్యత, డిమాండ్ ను బట్టి ధర ఉంటుందని, కనీస ధర అమలుచేయడం సాధ్యం కాదని చెబుతున్నారు. రైతుల దగ్గరనుంచి పంట కొన్నాక వాటిని నిల్వ చేసేందుకు తాము ఎంతో ఖర్చుపెట్టాల్సి ఉంటుందని.. అందువల్లే మొక్కజొన్న వంటి పంటలను కనీస మద్దతు ధర కన్నా తక్కువకు కొంటున్నామని తెలిపారు. మరోవైపు ప్రత్యామ్నాయ పంటలపై పంజాబ్ రైతులు దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ ఎప్పటినుంచో వినిపిస్తోంది. వరిసాగుకు అధికమొత్తంలో ఖర్చుచేసే బదులు.. ప్రత్యామ్నాయ పంటలను రైతులు పండించాలని వ్యవసాయరంగ నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా భిన్నమైన పంటలు పండిస్తే.. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత వంటి డిమాండ్ అవసరమే లేదనన్నది కొందరి అభిప్రాయం.

Also Read: దేశంలోనే అతి పొడవైన కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ.. దాని ప్రత్యేకతలు ఏమిటంటే?

ఇక రైతుల ఉద్యమంపై వినిపించే ఓ ప్రధానమైన విమర్శ.. చలో ఢిల్లీ ఉద్యమం కానీ, ఢిల్లీ చలో ఉద్యమం కానీ.. ఉత్తర భారతదేశానికే పరిమితం కావడం. వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా భావించే దక్షిణ భారతదేశ రైతులెవరూ ఈ రెండు ఉద్యమాల్లో మమేకం కాలేదు. అన్నదాతల ఆందోళనలపై అందరికీ సంఘీభావం ఉన్నప్పటికీ పంజాబ్, హర్యానా, యూపీ రైతులు మాత్రమే ఉద్యమంలో భాగస్వామ్యులుగా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం వ్యవసాయ చట్టాల వల్ల ఎక్కువ నష్టం కలిగేది తమకే అని పంజాబ్ రైతులు భావించడం. ఇప్పుడు రెండో విడత ఉద్యమం విషయంలోనూ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత వల్ల ఎక్కువ ప్రయోజనం పొందేదీ ఉత్తరభారతదేశం రైతులకే అన్న అభిప్రాయం ఉంది.

అప్పులను వారసత్వంగా ఇస్తున్న రైతులు
దేశం మొత్తం మీద వరి, గోధుమ పంటలను కనీస మద్దతు ధర కింద కేంద్రం కొనుగోలు చేసే శాతం 10అయితే.. పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో 90శాతం పంటను కొనుగోలు చేస్తుంది. దేశంలో ఉన్న 6వేల ఏపీఎంసీలలో 33శాతం పంజాబ్‌లోనే ఉన్నాయి. వ్యవసాయచట్టాల వల్ల ఈ భద్రత పోతుందని రైతులు అప్పుడు ఆందోళన చెందారు. ఇప్పుడు మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని ఆందోళన చేయడమూ ఇందులో భాగమే. పంజాబ్, హర్యానా, యూపీ కాకుండా మిగిలిన రాష్ట్రాల్లో అసలు ప్రభుత్వానికి పంట అమ్మే రైతుల సంఖ్య చాలా తక్కువ. బహిరంగ మార్కెట్ లోనే అమ్మకాలు ఎక్కువగా సాగుతుంటాయి. అతివృష్టి, అనావృష్టి వంటి కొన్ని పరిస్థితుల్లో వీలయినంత వేగంగా నష్టాల నుంచి తప్పించుకునేందుకు అందినకాడికి పంటను తెగనమ్ముకుంటుంటారు రైతులు.

Also Read: గాంధీ-నెహ్రూ కుటుంబ వారసులు యూపీలో గెలిచే పరిస్థితులు ఉన్నాయా?

మార్కెట్ శక్తుల ప్రభావం, వాతావరణ పరిస్థితులు, దళారుల రాజ్యం వంటివి దేశంలో వ్యవసాయాన్ని దండగగా మార్చివేస్తున్నాయి. రైతులు తమ వారసులకు పొలంతో పాటు భరించలేని అప్పులను వారసత్వంగా ఇస్తున్నారని ఎన్నో నివేదికలు చెబుతున్నాయి. ఈ తరుణంలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు వంటివాటిని అడ్డుకోవడానికి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చర్యలు చేపట్టాల్సిన అత్యవసర పరిస్థితులుండగా.. కనీస మద్దతు ధరతో పాటు మరికొన్ని డిమాండ్ల కోసం రైతులు చేస్తున్న ఆందోళన అసలు సమస్యలను మరుగున పడేలా చేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వ్యవసాయానికి దూరమవుతున్న రైతులు
అసలు 2020-21 ఉద్యమంలో ఒక్కతాటిపై నడిచిన రైతు సంఘాల నేతలు, పంజాబ్, హర్యానా రైతుల్లో ఎక్కువమంది ఇప్పటి ఉద్యమానికి దూరంగా ఉంటున్నారు. రెండు రైతు సంఘాల ఆధ్వర్యంలో మాత్రమే ఉద్యమం జరుగుతోంది. కనీస మద్దతు ధర కోసం పోరాడడానికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు పండించుకునే సౌకర్యాల కల్పన కోసం పోరాడడం మంచిదన్న అభిప్రాయం కూడా రైతుల్లో వ్యక్తమవుతోంది. గత ఉద్యమంలో చురుగ్గా ఉన్న రైతులు ఇప్పుడు గోధుమ, ఆవాల వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నారు. పంజాబ్ రైతుల్లో 80 శాతం అప్పుల్లో ఉన్నారు. పంజాబ్ రైతుల అప్పులు 70 వేల కోట్ల నుంచి లక్ష కోట్లు ఉంటాయని అధ్యయనాల్లో తేలింది.

Also Read: డ్రైవర్ లేకుండానే 84 కి.మీ. దూసుకుపోయిన రైలు.. చివరికి ఎలా ఆపారో తెలుసా?

మూడు దశాబ్దాలుగా వ్యవసాయానికి దూరంగా జరుగుతున్న రైతుల సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది. పంజాబ్‌లోనే కాదు.. మొత్తం దేశంలోనూ వ్యవసాయ కుటుంబాల సంఖ్య ప్రమాదకరస్థాయిలో పడిపోతోంది. రానున్న రోజుల్లో ఇది ఆహార సంక్షోభానికి దారితీసే ప్రమాదముంది. భవిష్యత్ పరిణామాలను అంచనా వేసి.. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు వ్యవసాయంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం, వ్యవసాయాన్ని లాభసాటి వృత్తిగా మార్చడం వంటివాటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి. రైతులు కూడా మూసపద్ధతిలో సాగు విధానాలు వదిలిపెట్టి మార్కెట్ అవసరాలకు, డిమాండ్‌కు తగ్గ్టట్టుగా వైవిధ్యభరితమైన పంటలు పండించాల్సిన అవసరముందని వ్యవసాయరంగ నిపుణులు సూచిస్తున్నారు.