Wild Elephant: 2 రోజుల్లో 13 మంది ప్రాణాలు తీసింది.. గ్రామస్తులను గజగజ వణికిస్తున్న గజరాజు

ఆ ఏనుగును తిరిగి అడవిలోకి తరిమివేయడానికి పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాకు చెందిన నిపుణులతో కూడిన అటవీ అధికారుల బృందాలను రంగంలోకి దించారు.

Wild Elephant: 2 రోజుల్లో 13 మంది ప్రాణాలు తీసింది.. గ్రామస్తులను గజగజ వణికిస్తున్న గజరాజు

Wild Elephant Representative Image (Image Credit To Original Source)

Updated On : January 8, 2026 / 9:42 PM IST

 

  • అలజడి రేపుతున్న అడవి ఏనుగు
  • ఏనుగు దాడిలో రెండు రోజుల వ్యవధిలో 13 మంది మృతి
  • తీవ్ర భయాందోళనలో గ్రామస్తులు
  • అడవుల నుంచి జనావాసాల్లోకి

Wild Elephant: అది ఓ అడవి ఏనుగు. అడవి నుంచి జనవాసాల్లోకి వచ్చేసింది. అంతే, బీభత్సం సృష్టిస్తోంది. మనుషుల ప్రాణాలు తీస్తోంది. మనిషి కనిపిస్తే చాలు అటాక్ చేస్తోంది. ఇలా 2 రోజుల వ్యవధిలో 13 మంది ప్రాణాలు తీసిందా అడవి ఏనుగు. జార్ఖండ్‌లోని వెస్ట్ సింగ్‌భూమ్ జిల్లాలో అడవి ఏనుగు దెబ్బకు గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. ఈ ఏనుగు 2 రోజుల్లోనే 13 మందిని చంపేయగా, మరో నలుగురు గాయపడ్డారని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

జనవరి 5న కోల్హాన్‌లో ఏనుగు దాడిలో ఏడుగురు చనిపోయారు. 6వ తేదీన నోవాముండి, హటగమారియలో ఆరుగురు ప్రాణాలు వదిలారు. ఈ ఘటనలతో అటవీశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఆ గజరాజును అడవిలోకి పంపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాగా అక్కడ గత డిసెంబర్ 16 నుంచి ఏనుగుల దాడిలో 22 మంది ప్రాణాలు వదలడం ఆందోళనకు గురి చేస్తోంది.

”సింఘ్‌భూమ్ జిల్లాలో ఏనుగుల దాడులు పెరిగాయి. గోయిల్కేరా బ్లాక్ ఏనుగుల దాడులకు కేంద్ర బిందువుగా మారింది. మంద నుండి విడిపోయిన ఒక ఏనుగు గ్రామాల్లోకి చొరబడి ఇళ్లను ధ్వంసం చేస్తోంది. నిల్వ ఉంచిన ఆహార ధాన్యాలను నాశనం చేస్తోంది. కంటికి కనపడ్డ మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు” అని అధికారులు తెలిపారు. అడవులను ఆక్రమించడం, ఆహారం దొరక్కపోవడం తదితర కారణాలతో అడవుల్లో ఉండాల్సిన ఏనుగులు ఇలా జనావాసాల్లోకి వస్తున్నాయని వెల్లడించారు.

”గత కొన్ని రోజులుగా పలువురిపై దాడి చేసిన ఆ ఏనుగు, మంగళవారం రాత్రి నోవాముండి, హత్‌గమారియా పోలీస్ స్టేషన్ల పరిధిలోకి ప్రవేశించి, ఒకే కుటుంబానికి చెందిన నలుగురితో సహా ఆరుగురిని తొక్కి చంపింది. అదే ఏనుగు అంతకు ముందు రోజు కోల్హన్ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో సహా ఏడుగురి ప్రాణాలను బలిగొంది. ఆ ఏనుగును తిరిగి అడవిలోకి తరిమివేయడానికి పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాకు చెందిన నిపుణులతో కూడిన అటవీ అధికారుల బృందాలను రంగంలోకి దించాం” అని అధికారులు తెలిపారు.

Also Read: ట్రే గుడ్లు 35 లక్షలు, లీటర్ వంట నూనె 18 లక్షలు.. ఇరాన్‌లో దారుణ పరిస్థితులు.. ఎందుకిలా