సూర్యగ్రహణం అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం.. అసలు నిజం ఇదీ..

సూర్యగ్రహణం శాస్త్రవేత్తలకు సూర్యుని గురించి విలువైన సమాచారాన్ని సేకరించడానికి ఒక అద్భుతమైన అవకాశం. ఈ సమయంలో వారు సూర్యుని కరోనా (బాహ్య వాతావరణం), ఇతర అరుదైన ఖగోళ విషయాలను పరిశీలించగలుగుతారు.

సూర్యగ్రహణం అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం.. అసలు నిజం ఇదీ..

Updated On : August 1, 2025 / 9:22 PM IST

సమాచారాన్ని తప్పుదారి పట్టించేలా సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు వస్తుంటాయి. 202 ఆగస్టు 2న సూర్యగ్రహణం సంభవిస్తుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇది తప్పుదారి పట్టించే సమాచారం. 2025, ఆగస్టు 2న సూర్యగ్రహణం ఉండదని నాసా (NASA), ఇతర ఖగోళ శాస్త్ర నిపుణులు స్పష్టం చేశారు.

నిజానికి, 2027 ఆగస్టు 2న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇది చాలా అరుదైన సూర్యగ్రహణం. ఇది శతాబ్దంలోనే అత్యంత వ్యవధి ఉంటుంది. ఇది దాదాపు 6 నిమిషాలకు పైగా ఉంటుంది. సూర్యగ్రహణం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

సూర్యగ్రహణం అంటే ఏమిటి? 
చంద్రుడు భూమికి, సూర్యునికి మధ్యగా ప్రయాణిస్తూ.. సూర్యుని కాంతిని పాక్షికంగా లేదా పూర్తిగా అడ్డుకున్నప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఇది అమావాస్య రోజున భూమి, సూర్యుని మధ్య వాతావరణంలోకి చంద్రుడు వచ్చినప్పుడు జరుగుతుంది.

సూర్యగ్రహణం శాస్త్రవేత్తలకు సూర్యుని గురించి విలువైన సమాచారాన్ని సేకరించడానికి ఒక అద్భుతమైన అవకాశం. ఈ సమయంలో వారు సూర్యుని కరోనా (బాహ్య వాతావరణం), ఇతర అరుదైన ఖగోళ దృగ్విషయాలను పరిశీలించగలుగుతారు. ఈ పరిశీలనల ద్వారా సూర్యుడి గురించి లోతైన విశ్లేషణలు చేయడానికి వీలు కలుగుతుంది.

సూర్యగ్రహణాల రకాలు
సంపూర్ణ సూర్యగ్రహణం (Total Solar Eclipse): చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేస్తాడు. అప్పుడు సూర్యుని చుట్టూ ఉన్న కరోనా ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

వ‌ల‌య‌కార సూర్యగ్రహణం (Annular Solar Eclipse): చంద్రుడు సూర్యుడి కంటే చిన్నగా కనిపించి, సూర్యుడి చుట్టూ ఒక అగ్నివలయం (ring of fire) ఏర్పడుతుంది.

పాక్షిక సూర్యగ్రహణం (Partial Solar Eclipse): చంద్రుడు సూర్యుడిలో కొంత భాగాన్ని మాత్రమే మనకు కనపడకుండా అడ్డుకుంటాడు.

హైబ్రిడ్ సూర్యగ్రహణం (Hybrid Solar Eclipse): ఇది చాలా అరుదైనది. కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణంగా, మరికొన్ని ప్రాంతాల్లో వలయకారంగా కనిపిస్తుంది.

2025, 2026, 2027లో సూర్యగ్రహణాలు

2025, సెప్టెంబర్ 21: ఆస్ట్రేలియా, అంటార్కిటికా, పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలలో పాక్షిక సూర్యగ్రహణం.

2026, ఫిబ్రవరి 17 అంటార్కిటికాలో వలయకార సూర్యగ్రహణం. పాక్షిక గ్రహణం అంటార్కిటికా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, పసిఫిక్ & అట్లాంటిక్ మహాసముద్రాలు, హిందూ మహాసముద్రంలో కనిపిస్తుంది.

2026, ఆగస్టు 12: “శతాబ్దపు గ్రహణం”గా పిలవబడే సంపూర్ణ సూర్యగ్రహణం గ్రీన్లాండ్, ఐస్‌లాండ్, స్పెయిన్, రష్యా, పోర్చుగల్ వంటి ప్రాంతాలలో కనిపిస్తుంది. యూరప్, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్ మహాసముద్రాలలో పాక్షిక గ్రహణం కనిపిస్తుంది.

2027 ఆగస్టు 2: “ఈ శతాబ్దపు గ్రహణం”.. ఎక్కడ చూడొచ్చు?

సంపూర్ణ గ్రహణం: అల్జీరియా, ఈజిప్ట్, మొరాకో, సౌదీ అరేబియా, యెమెన్, స్పెయిన్ వంటి దేశాల్లో కనిపిస్తుంది.

పాక్షిక గ్రహణం: ఆఫ్ఘానిస్థాన్, సోమాలియా, సూడాన్, టునీషియా, బ్రిటిష్ ఇండియన్ ఓషన్ టెరిటరీ, అనేక ఇతర దేశాల్లో కనిపిస్తుంది.

సరైన సమయం తెలుసుకోండి: మీ ప్రాంతంలో గ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది అనే వివరాలను నాసా వంటి సోర్సుల ద్వారా తెలుసుకోండి.

సర్టిఫైడ్ సోలార్ వీవింగ్ గ్లాసెస్ (ISO 12312-2 ప్రమాణాలతో) లేదా హ్యాండ్‌హెల్డ్ వీయర్స్ ఉపయోగించండి. నేరుగా సూర్యుని వైపు చూడటం కళ్లకు అత్యంత ప్రమాదకరం. గ్రహణాన్ని స్పష్టంగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా వీక్షించే ప్రదేశాన్ని ఎంచుకోండి. ఈ అరుదైన, అద్భుతమైన ఖగోళ దృగ్విషయాన్ని ఆస్వాదిస్తూ, వీలైతే ఫొటోలు లేదా వీడియోలు తీసుకోండి.